రాష్ట్రంలో మొదటి ఓటరు బీఎస్పీలో చేరిక

-కోనప్ప అటవీ వనరులు, కోట్లు దోచుకున్నడు
-అవ‌కాశం ఇస్తే మీ రుణం తీర్చుకుంటా
-బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BSP: తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి ఓట‌రు తుర్పం సుమ‌నాబాయి బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీలో చేరారు. ఆమె సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద‌మాలిని గ్రామంలో ఉంటారు. బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు డా. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బుధ‌వారం మాలిని గ్రామ‌స్తుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 70 ఏళ్లుగా ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు రోడ్డు సౌకర్యం లేదన్నారు. క‌నీసం బస్సు సౌకర్యం లేదని, అత్యవసర పరిస్థితిలో దవాఖానకు పోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన మండి పడ్డారు.

ఎమ్మెల్యే కోనప్ప ఇదే గ్రామంలోని ప్రజలను తన అక్రమ అటవీ సంపద, కర్ర దొంగ రవాణా చేయడానికి వాడుకొని కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. కెవి నారాయణ నుండి కోనప్ప వరకు సిర్పూర్ నియోజకవర్గంలోని వనరులు దోచుకొని అభివృద్ధిని మరిచారన్నారు. కోనేరు కోనప్ప అద్దాల మేడల్లో ఉంటూ, మన పేదలను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసుల బతుకులు మారాలంటే మన బహుజన రాజ్యం రావాలన్నారు. అందుకే ఏనుగు గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వాలని, గెలిపిస్తే తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని మొద‌టి ఓట‌రు తుర్పం సుమ‌నాబాయి, గ్రామ పెద్ద రామ్‌సో తో స‌హా ప‌లువురు బీఎస్పీలో చేరారు.

యాత్రలో భాగంగా బీఎస్పీ చీఫ్ ప్ర‌వీణ్‌కుమార్ చీలపల్లి, పూసిగూడ, మాలిని గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్, అధికార ప్రతినిధి సంజయ్, రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, జిల్లా నాయకులు దుర్గం ప్రవీణ్, నవీన్, చాంద్ పాషా, నక్క మనోహర్, మహిళా నాయకురాలు విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like