ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై సమగ్ర విచారణ..

-ఆదివాసులపై ఆమానవీయ దాడులు శోచనీయం
-ఎస్టీ నేషనల్ కమిషన్ చైర్మన్ హరీష్ చౌహాన్ హామీ ఇచ్చారు
-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులపై అధికారులు తరచూ దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ ఆక్షేపించిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్ప‌ష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జాతీయ గిరిజన హక్కుల కమిషన్ చైర్మన్ హరీష్ చౌహాన్ను ఎంపీ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పోడు భూముల సమస్య, ఆదివాసులపై జరుగుతున్న అధికారుల దాడులు, తెలంగాణలో పోడు భూములకు పట్టాలు తదితర సమస్యలను గిరిజన కమిషన్ కు విన్నవించారు. మంచిర్యాల జిల్లా కోయపోషగూడ లో ఫారెస్ట్ సిబ్బంది పోలీసులు అమానుషంగా దాడులు చేసి 12 మంది మహిళలను అరెస్టు చేయడమే కాక జైలుకు పంపిన విషయాన్ని ప్ర‌స్తావించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ప్రాంతాల్లో అనాదిగా పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులపై దాడులు చేసి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోంద‌ని విన్నవించారు. తెలంగాణలోని చింతగూడ, నమోరం, రసన గూడ, తుమ్మలచెరువు, సల్ సల, జన్నారం ప్రాంతాల్లో 2004 కంటే ముందు నుండి ఆదివాసులు పోడు భూములు సాగు చేసుకుంటూ బతుకులు వెల్ల దీస్తున్నారని చెప్పారు.

హరితహారం పేరిట పోడు భూములను లాక్కుంటూ ఆదివాసులను గిరిజన గూడెంలో నుండి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్న‌దని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ హరిశ్ చౌహన్ కోయపోషగూడ ఘటనపై నివేదిక కోసం మూడు రోజుల్లో ఫారెస్ట్ అధికారులకు నోటీసులు ఇస్తామ‌ని చెప్పిన‌ట్లు ఎంపీ వెల్ల‌డించారు. బాధ్యులైన అధికారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలపై నెల రోజుల్లో సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు సోయం బాబు వెల్ల‌డించారు. ఆదివాసులు పోడు భూముల విషయంలో ధైర్యంగా ఉండి పోలీసులు ఫారెస్ట్ దాడులపై వెంటనే స్పందించి అవసరమైతే సత్వర న్యాయం కోసం జాతీయ కమిషన్ pstochairperson@ncst.nic.in, adilabadmp@gmail.com ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సోయం బాపురావు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like