మూడో శాస‌న‌స‌భ ఏర్పాటు

-గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఎన్నిక‌ల క‌మిష‌న్‌
-గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అంద‌జేత‌
-ప్ర‌స్తుత శాస‌న స‌భ ర‌ద్దు చేసిన గ‌వ‌ర్న‌ర్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా సీఈవో వికాస్ రాజ్ గవర్నర్‌కు సమర్పించారు. పాత శాసనసభ రద్దు కావ‌డంతో కొత్త శాసనసభ కొలువు తీరనుంది. మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ కాసేపటి క్రితమే అసెంబ్లీ రద్దు ప్రతులను గవర్నర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి అందజేశారు. తెలంగాణలో ఈరోజు రాత్రికే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాత్రి 8:30 గంటలకు సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఈ మేరకు దిల్‌కుష్‌ అతిథి గృహానికి వాహనాలను తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జీఏడీ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. అధికారులు పాత బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like