వైఫ‌ల్యం నుంచి విజ‌యం దాకా..

“విశ్వంలో వైఫల్యం లాంటిదేమీ లేదు”
స్వామి వివేకానంద

ఒక వైఫ‌ల్యం మ‌నిషిలో క‌సిని పెంచుతుంది… ప‌ట్టుద‌ల నూరిపోస్తుంది… విజ‌యాన్ని అందుకోవాల‌ని త‌పించేలా చేస్తుంది… విజ‌యం అంచులకు వెళ్లేవ‌ర‌కు నిద్ర లేకుండా చేస్తుంది. చంద్ర‌యాన్ 3 విజ‌యం వెన‌క ఉంది అదే.. చంద్ర‌యాన్ 2 వైఫ‌ల్యం, ఆ ప్రాజెక్టులో నేర్చుకున్న గుణ‌పాఠాలు చంద్రయాన్ 3 స‌క్సెస్‌కు బాట‌లు వేశాయి.

చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగంపై దేశ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. అది విజ‌య‌వంతం కావాల‌ని పెద్ద ఎత్తున ఆకాక్షించారు. దేశ‌ప్ర‌జ‌లంతా ఎదురుచూసిన క్ష‌ణం రానే వ‌చ్చింది. 2019 సెప్టెంబరు 6. ఇస్రో పంపిన చంద్రయాన్ 2 ప్రయోగం చంద్రుడిపై దిగాల్సిన సమయం.. ఒక్కో ప్ర‌యోగం విజ‌య‌వంతం అవుతోంది. ప్ర‌జ‌లు, శాస్త్ర‌వేత్త‌ల్లో ఆనందం. కానీ, చివరి క్షణంలో ల్యాండ‌ర్ నుంచి భూమిపైకి కనెక్షన్ తెగిపోయింది. చంద్రయాన్ 2 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయినట్లు అప్పటి ఇస్రో చీఫ్ కె. శివన్ ప్రకటించారు. చంద్రయాన్ 2 ల్యాండింగ్ చూసేందుకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

కేవ‌లం నాలుగేండ్ల‌లో చంద్ర‌యాన్ 3 ప్రాజెక్టు చేప‌ట్టింది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈసారి విజ‌య‌వంతం చేయాల‌నే సంక‌ల్పంతో శాస్త్ర‌వేత్త‌లు నిద్రాహారాలు మాని ప‌ని చేశారు. అనుకున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ఇంత‌లో మ‌న కంటే ముందే ర‌ష్యా చేసిన ప్ర‌యోగం మ‌రింత ఆందోళ‌న క‌లిగించింది. గ‌తంలో దెబ్బ‌తిని ఉన్నాం… ఇదో విప‌త్తు అయినా ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్రో అధికారులు ముందుకు సాగారు. ఆగ‌స్టు 23, 2023 ప్ర‌పంచ చరిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ సాధించ‌లేని అద్భుతాన్ని భార‌త్ సాధించింది. అమెరికా, చైనా, రష్యాలకు సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపి అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించింది.

ఓట‌మిలో నుంచే గెలుపు చూడాల‌నే చేసిన ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంతం అయ్యాయి. చంద్రయాన్-2లో ఉపయోగించిన ‘సక్సెస్‌-బేస్డ్‌ డిజైన్’ కాకుండా చంద్రయాన్-3 కోసం ఇస్రో ‘ఫెయిల్యూర్‌-బేస్డ్‌ డిజైన్’ వ్యూహాన్ని అనుసరించింది. ఇది ప్రాజెక్టు విజ‌య‌వంతానికి ఎంత‌గానో తోడ్ప‌డింది. చంద్రయాన్‌ 2 ల్యాండింగ్‌కు గుర్తించిన ప్రదేశం గతంలో 500 మీటర్ల పొడవు.. 500 మీటర్ల వెడల్పు ఉంది. తాజాగా చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌కు 4 కిలోమీటర్ల పొడవు 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేశారు. దీనిలో ఎక్కడైనా అది ల్యాండ్‌ అయ్యే అవకాశం కల్పించడంతో ల్యాండర్ దిగేందుకు మార్గం మరింత సులువైపోయింది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ల్యాండింగ్ చేస్తున్న స‌మ‌యంలోనే చంద్ర‌యాన్ 2 వైఫ‌ల్యం చెందింది. ల్యాండర్ ఇంజన్‌లు వేగాన్ని తగ్గించే ప్రక్రియలో ఊహించిన దానికంటే ఎక్కువ ఒత్తిడిని విడుద‌ల చేశాయి. దీంతో ఇంజ‌న్ వేగం త‌గ్గ‌కుండా ల్యాండింగ్ జ‌రిగింది. దీంతో అది విఫ‌ల‌మైంద‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. అనుభవ పాఠాలతో ముందడుగు వేసిన ఇస్రో. చంద్రయాన్‌-2 పంపిన అద్భుతమైన చిత్రాల ఆధారంగా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు. వైఫల్యాలకు ఉన్న అవకాశాలను విశ్లేషించుకొని, వాటిని అధిగమించేలా రూపొందించింది. ఒకేసారి అన్ని సెన్సార్లూ పనిచేయకపోయినా, నాలుగింట్లో రెండు ఇంజన్లు విఫలమైనా జాబిల్లిపై సురక్షితంగా దిగేలా దీనిని తీర్చిదిద్దారు. అందుకే ఈసారి చరిత్ర సృష్టించింది… విజ‌య‌తీరాల‌కు చేరుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like