అడ‌వి నుంచి అమ‌ర‌త్వం దాకా..

-నాలుగు దశాబ్దాల పాటు పోరుబాట‌లోనే
-రాడిక‌ల్ స్టూడెంట్ గా ఉద్య‌మంలోకి
-ఇంద్ర‌వెల్లి పోరాటానికి ఆద్యుడు ఆయ‌నే
-సికాస ఏర్పాటులో సైతం కీల‌క‌పాత్ర
-పోలీసుల‌పై దాడుల్లో మాస్ట‌ర్‌మైండ్
-ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లను వ్య‌తిరేకించిన మావోయిస్టు నేత
-క‌ట‌కం సుద‌ర్శ‌న్ అలియాస్ ఆనంద్ అలియాస్ దూలాదాదా ప్రస్థాన‌మిది

Maoist leader Katakam Sudarshan: పేదోళ్ల క‌న్నీళ్లు తుడిచేందుకు.. వారిని ఆక‌లి బాధ నుంచి విముక్తి చేసేందుకు.. పీడిత, తాడిత వ‌ర్గాల దాస్య శృంఖ‌లాలు తెంచేందుకు ఆయ‌న అడ‌వి బాట ప‌ట్టారు. ఆయ‌న ఉద్య‌మంలోకి వెళ్లింది మొద‌లు ఇంటి వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. అడ‌వి బిడ్డ‌లే ఆయ‌న‌కు ఆప్తుల‌య్యారు.. ఉద్య‌మ పార్టీనే ఆయ‌న‌ను అక్కున చేర్చుకుంది. చివ‌ర‌కు ఓ పిడుగులాంటి వార్త వినిపించింది. క‌ట‌కం సుద‌ర్శ‌న్ అలియాస్ ఆనంద్ అలియాస్ దూలాదాదా ఇక లేర‌ని… రార‌ని…

సింగ‌రేణి కార్మికుడి నుంచి సికాస ఏర్పాటు..
నాలుగు ద‌శాబ్దాల ప్ర‌జా విప్ల‌వ ప్ర‌స్థానం ముగిసింది. క‌ట‌కం సుద‌ర్శ‌న్ తీవ్ర అనారోగ్యంతో మృత్యువాత‌ప‌డ్డార‌ని మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ ప్ర‌క‌టించింది. మే 31న ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణానికి చెందిన కటకం సుదర్శన్ 1974లో మైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. చదువుకునే సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రామకృష్ణాపూర్‌లోని సింగరేణిలో కార్మికుడిగా ఉద్యోగం చేసిన క‌ట‌కం సుద‌ర్శ‌న్ సికాస ఏర్పాటులో సైతం ప్ర‌ధాన పాత్ర వ‌హించారు. ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణిలో 1974-75 సంవత్సరాల్లో నల్లా ఆది రెడ్డి, గజ్జెల గంగారాం, గండం రామస్వామి, పెద్ది శంకర్, మెరుగు స‌త్య‌నారాయణ, కట్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభించిన వారిలో క‌ట‌కం సుద‌ర్శ‌న్ ముఖ్యులు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన ఉద్యమానికి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1986లో దండకారణ్య అటవీ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 1995లో కొత్తగా ఏర్పాటైన NTSZC కార్యదర్శిగా పనిచేశారు. ఆరు నెలల తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2000 నుండి అతను సెంట్రల్ కమిటీలో పాలిటీ బ్యూరో సభ్యునిగా మరియు CRB కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

పోలీసుల‌పై దాడిలో మాస్ట‌ర్‌మైండ్‌..
సుమారు 59 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపిన క‌ట‌కం సుద‌ర్శ‌న్ పోలీసుల‌పై దాడిలో మాస్ట‌ర్‌మైండ్‌గా పేరొందారు. ఆయ‌న దాడి చేశారంటే గురి త‌ప్ప‌కుండా పెద్ద ఎత్తున శ‌త్ర‌వుల‌కు న‌ష్టం క‌ల‌గాల్సిందే. అలా ఉండేది క‌ట‌కం ప్లానింగ్‌. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దర్భాఘాటిలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో 27 మంది మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారి కటకం సుదర్శనే. దంతెవాడలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికీ సూత్రధాని ఆయనే. కఠినమైన గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఆయ‌నకు పేరుంది. ఛత్తీస్‌గఢ్ లో సైనిక దళాలపై మిలిటరీ కచ్చితత్వ దాడుల ప్రణాళిక గెరిల్లా వార్‌ఫేర్లో మావోయిస్టు క్యాడర్ కు శిక్షణ సైతం ఇచ్చేవారు. ఆయ‌న‌పై కేవ‌లం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 21కి పైగా కేసులు ఉన్నాయంటే అర్దం చేసుకోవ‌చ్చు.

చ‌ర్చ‌ల‌ను వ్య‌తిరేకించారు..
ఆయ‌న పార్టీ సిద్ధాంతాల ప‌ట్ల ఎంతో నిబ‌ద్ద‌త‌తో ఉండేవార‌ని చెబుతారు. మావోయిస్ట్‌లో అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగారు. ఉత్తర తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ మధ్య విస్తరించిన దండకారణ్యాన్ని కేంద్రబిందువుగా చేసుకుని కార్యకలాపాలను సాగించారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ తరువాత‌ మావోయిస్ట్ సెంట్రల్ రీజినల్ బ్యూరో చీఫ్‌గా పని చేశారు. క‌ట‌కం సుద‌ర్శ‌న్ ప్ర‌భుత్వంతో జ‌రిగే చ‌ర్చ‌ల విష‌యంలో పూర్తిగా వ్య‌తిరేకించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పారు. అయితే, మావోయిస్టు పార్టీ తీసుకున్న నిర్ణ‌యానికి ఆయ‌న క‌ట్టుబ‌డ్డారు. గ‌తంలో ఒక సీనియర్ పోలీసు అధికారి ఒకసారి జ‌ర్న‌లిస్టుల‌తో మాట్లాడుతూ “సుదర్శన్ ఆజాద్ లాగా శాంతికాముకుడు కాదు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి అతని పార్టీ చొరవకు ఆయ‌న వ్యతిరేకం” అని చెప్పుకొచ్చారు.

ఇంటి ముఖం చూడ‌లే…
న‌ల‌భై ఏండ్ల ఆయ‌న విప్లవ ప్ర‌స్థానంలో ఎన్న‌డూ ఇంటి ముఖం చూడ‌లేదు. కటకం సుదర్శన్ తల్లిదండ్రులు మల్లయ్య, వెంకటమ్మ 2017 లో తల్లి 2018 లో తండ్రి మృతి చెందారు. ఆయన భార్య సాధన అలియాస్ లలిత ఇదివరకే పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. సాధన కూడా మావోయిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిన వారే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు కార్యదర్శిగా పని చేశారు. ఆయ‌న ఇంట్లో నుంచి వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటి ముఖం చూడ‌లేద‌ని ఆయ‌న సోద‌రులు వెల్ల‌డించారు. క‌ట‌కం సుద‌ర్శ‌న్ మృత్యువాత డ‌ప‌డ‌టంతో మావోయిస్టు పార్టీ నెల రోజుల పాటు సంతాప సభలు నిర్వహించ‌నుంది. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప సభలను నిర్వహించనున్నట్లు వెల్ల‌డించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like