సింగ‌రేణి కార్మికుల భ‌విష్య‌త్తు వేలం

-సంస్థను కనుమరుగు చేసే కుట్ర సాగుతోంది
-మంద‌మ‌ర్రిలో 1/70 యాక్ట్ స‌రికాదు
-అభివృద్ధి యజ్ఞం కొనసాగుతోంది
-ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌

Balka Suman: కేంద్రం సింగ‌రేణికి చెందిన నాలుగు బ్లాకుల వేలంతో మొదలుపెట్టి ప్రైవేటీకరించే కుట్ర చేస్తోంద‌ని, ఇది సింగరేణి వేలం కాదని.. కార్మికుల భవిష్యత్తు వేలం వేయడమేన‌ని ప్ర‌భుత్వ విప్‌ బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మందమర్రి సింగరేణి హై స్కూల్ మైదానంలో నిర్వహించిన మందమర్రి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కేంద్రం సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికి కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలా సింగరేణిని నష్టాల బాట పట్టించి సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే కుట్ర అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే కారుణ్య నియామకాలు ఉండవని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణి ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుండటంతో సంస్థపై అక్కసు వెల్లగక్కుతున్నారని దుయ్య‌బ‌ట్టారు.

గుజరాత్ లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా అప్పగించారని, ఇక్క‌డ అందుకు విరుద్దంగా ప్ర‌వ‌రిస్తున్నార‌ని బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. గుజరాత్ కు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా…? అని ప్ర‌శ్నించారు. సింగరేణికి ప్రైవేట్ వాళ్లకు బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుందని, ప్రైవేటు మాఫియా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తారన్నారు. కార్మికుల రక్షణకు, పర్యావరణానికి ప్రైవేట్ మాఫియా ప్రాధాన్యత ఇవ్వవని స్ప‌ష్టం చేశారు. కొత్త గనులు రావని, వారసత్వపు ఉద్యోగాలు ఉండవన్నారు. గనులు మూతపడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారని అన్నారు. కార్మిక హక్కులు, బోనస్లు, అలవెన్స్ లకు గండి కొడతారని, దేశ సంపద ప్రైవేటు చేతుల్లోకి వెళితే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణి కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు వారసత్వ ఉద్యోగాలు పోగొడితే.. తెలంగాణ ప్రభుత్వంలో 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామ‌న్నారు. సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణంలో రూ. 172.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 1/70 యాక్ట్ (షెడ్యూల్ ఏరియా) నుండి మందమర్రి పట్టణాన్ని మినహాయింపు ఇచ్చి ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చూడాలని కోరారు. 1/70 యాక్ట్ 50% పైగా గిరిజనులు, ఆదివాసులు, కొండ ప్రాంతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నపుడే అమలు చేయాలని బురియా కమిటీ పార్లమెంట్ కు సిఫార్సు చేసింద‌న్నారు. మందమర్రిలో 2.68% మాత్రమే ST లు నివసిస్తున్నారన్నారు. 1/70 యాక్ట్ వల్ల GO 76, 58, 59 అమలు చేయలేకపోతున్నామ‌ని బాల్క ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు భవన నిర్మాణానికి అనుమతులు రావని, బ్యాంకు లోన్లు సైతం రావ‌న్నారు. ప్రజాప్రతినిధులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అభివృద్ధి యజ్ఞం కొనసాగుతోంద‌ని, విపక్షాల కుట్రలను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల‌ని కోరారు. సమ్మేళనంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like