కారు దిగి కాంగ్రెస్‌లోకి..

Telangana Congress: తెలంగాణలో ఎన్నికల వేడి ర‌గులుతోంది. పెద్దనేత‌ల జంపింగ్‌లు కొన‌సాగుతుండ‌గా, ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం సైతం అదే బాట పడుతోంది. అయితే పెద్ద ఎత్తున స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేర‌డ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఒక్కసారిగా 42 మంది కారు దిగి.. హస్తం గూటికి చేరారు. గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వీరందరికీ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కండువాలు క‌ప్పి ఆహ్వానించారు.

గద్వాల జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్ సరిత రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆమె ఆ పార్టీలో చేర‌డ‌మే కాకుండా, నియోజ‌క‌వ‌ర్గం మొత్తం కాంగ్రెస్ బాట ప‌ట్టేలా చేశారు. బీఆర్ఎస్‌ ద్వితీయ శ్రేణి నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను తన వెంటే కాంగ్రెస్ బాట పట్టేలా సరిత, ఆమె భర్త తిరుపతయ్య చక్రం తిప్పారు. ఒకేసారి.. 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలను కాంగ్రెస్‌లో చేర్చారు. గాంధీ భవన్ వేదికగా.. రేవంత్ సమక్షంలో 42 మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు పలువురు గద్వాల్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేతలందరికీ కండువా కప్పిన రేవంత్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కంచుకోట అని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చేరికల కార్యక్రమంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఇతర పీఏసీ సభ్యులతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like