లక్షలాది మందికి స్ఫూర్తి

గిరిజన విద్యార్థిని శ్రీలతకు అండగా మంత్రి కేటీఆర్

కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థిని కారం శ్రీలతకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకు చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్ర‌ద‌ర్శించేది. నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. శ్రీలతకి ఐఐటి ఫీజులు చెల్లించేందుకు మార్గం లేకపోవ‌డంతో తన ఉన్నత విద్య స్వప్నం చెదిరి పోతుందేమోనని ఆందోళ‌న ప‌డేది. ఆమె పరిస్థితి మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ తన సొంత నిధులతో శ్రీలత ఐఐటీ విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో శ్రీలతను అభినందించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని కేటీఆర్ అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని అభినందించారు. శ్రీలతకు, ఆమె విద్యాభ్యాసానికి మంత్రి కేటీఆర్ అండగా నిలవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like