గిరిజ‌నులు హెచ్చరించారు.. అధికారులు వెళ్లిపోయారు..

మా గ్రామాల్లో మీ చెక్‌పోస్టులు ఎందుకు..? మీరు ఇక్క‌డ ఏం చేస్తారు..? ఇలాగే ఉంటే మిలిటెంట్ త‌ర‌హా పోరాటాలు చేస్తామ‌ని గిరిజ‌నులు, తుడుం దెబ్బ నాయ‌కులు ఫారెస్టు సిబ్బందిని హెచ్చ‌రించారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం కోయ‌పోశ‌గూడెంలో పోడుభూముల‌కు సంబంధించి వివాదం కొన‌సాగుతోంది. కొన్ని రోజులుగా భూములు సాగు చేసుకుంటామ‌ని, గుడిసెలు వేసుకుంటామ‌ని గిరిజ‌నులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, వీలు లేద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అట‌వీ శాఖ అధికారులు గిరిజ‌నుల‌పై కేసులు న‌మోదు చేయ‌డం, జైలుకు పంప‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత కూడా మ‌ళ్లీ వివాదస్పద భూముల్లో గుడిసెలు వేసుకోవ‌డం అధికారులు వాటిని తొల‌గించ‌డం ఆందోళ‌న‌లు ఇలా కొన‌సాగుతోంది. తాజాగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా బంద్‌తో పాటు గిరిజ‌న సంఘాలు చ‌లో కోయ‌పోశ‌గూడెం పిలుపునిచ్చాయి. దీంతో బ‌య‌టి వాళ్లు రాకుండా క‌ట్ట‌డి చేసేందుకు కోయ‌పోశ‌గూడెం వ‌ద్ద అట‌వీశాఖ అధికారులు బేస్‌క్యాంప్‌ ఏర్పాటు చేశారు. దీంతో శ‌నివారం గిరిజనులు, తుడుందెబ్బ నాయ‌కులు క‌లిసి అక్క‌డికి వెళ్లారు. ఆదివాసుల అనుమ‌తి లేకుండా మా ప్రాంతంలో బేస్‌క్యాంప్ ఎలా ఏర్పాటు చేస్తార‌ని ఫారెస్టు సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా పైన దాడులు చేసి మాపై కేసులు న‌మోదు చేసిన మీరు ఇక్క‌డ ఉండొద్ద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒకవేళ అలాగే ఉంటే మిలిటెంట్ త‌ర‌హా పోరాటాలు చేస్తామ‌ని వారు హెచ్చ‌రించారు. దీంతో ఫారెస్టు సిబ్బంది వెంట‌నే అక్క‌డ బేస్ క్యాంపు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like