గోదారి ఒడ్డుపొంట గోస

నిత్యం వేల ఎకరాల్లో పంట నీటిపాలు - మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో రైతులకు భారీ నష్టం - ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదంటూ రైతుల ఆవేదన - కంటి తుడుపు చ‌ర్య‌ల‌కే ప‌రిమితం అవుతున్న ప్ర‌తిప‌క్ష నాయ‌కులు

మంచిర్యాల : నీళ్లుంటే త‌మ పొలాలు పండుతాయ‌ని… క‌ష్టాలు తీరుతాయ‌ని… క‌న్నీళ్లు దూర‌మ‌వుతాయ‌ని రైత‌న్న ఆనంద ప‌డుత‌డు.. నాలుగు రాళ్లు వెన‌కేసుకుని పిల్లాపాప‌ల‌కు ఎలాంటి క‌ష్టం రాకుండా చూసుకోవ‌చ్చ‌ని క‌ల‌లు కంటాడు…
—————————————————————————
కానీ ఆ నీళ్లే రైతుల పాలిట శాప‌మ‌య్యాయి. క‌న్నీళ్లు మిగిలిస్తున్నాయి. పంట‌లను ముంచి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రైతుల గోస ప‌ట్టించుకునే వారు లేక, మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్య‌మ‌నే ప‌రిస్థితికి తీసుకువ‌స్తున్నాయి.
—————————————————————————
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్​ రైతుల‌ను కన్నీళ్లు పెట్టిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​ వాటర్​ మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలను ముంచుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి అదే ప‌రిస్థితి. ప్రాజెక్టు అయినందుకు సంతోషించాలో బాధ ప‌డాలో తెలియ‌ని ప‌రిస్థితి అని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర్షాకాలంలో పెద్ద ఎత్తున కురుస్తున్న వానలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో నిత్యం రైతులు వేసుకుంటున్న పంట‌లు మునుగుతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో అన్న‌దాత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అధికారుల త‌ప్పిదం వ‌ల్ల‌నేనా…?
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అధికారులు చేసిన త‌ప్పిదం వ‌ల్ల‌నే ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అధికారులు కేవలం బ్యారేజీల ద్వారా వచ్చే వాటర్​ను అంచనాలోకి తీసుకున్నారని, క్యాచ్​మెంట్​ ఏరియా నీటిని అంచనా వేయలేద‌ని ప‌లువురు ఇంజ‌నీరింగ్ నిపుణులు చెబుతున్నారు. న‌దికి వ‌చ్చే నీటితో పాటు పలు వాగులు, ఒర్రెల నుంచి పెద్ద ఎత్తున గోదావరికి వరద వస్తోంది. దీంతో బ్యారేజీల గేట్లు ఎత్తినా ఫలితం లేకుండా పోతోందని స్ప‌ష్టం చేస్తున్నారు. బ్యాక్​ వాటర్​ రెండువైపులా రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తూ పంటలను ముంచుతోంది. ప్ర‌తి ఏటా రెండు,మూడు సార్లు వేసుకున్న పంట‌లు సైతం నీటి పాల‌వుతున్నాయి. గ‌త ఏడాది ఎస్సారెస్పీ నుంచి మేడిగడ్డ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​ చేశారు. అయినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది.

మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున న‌ష్టం..
మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్​, మంచిర్యాల, నస్పూర్​, జైపూర్​, చెన్నూర్​, కోటపల్లి వరకు.. పెద్ద‌ప‌ల్లి జిల్లా వెల్గటూర్​, అంతర్గాం, రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లా వరకు గోదావరి ఒడ్డున పంటలు మునిగిపోతున్నాయి. ప్రాణహిత న‌ది వైపు ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్​, పెంచికల్​పేట్​, దహెగాం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి వరకూ ఇదే పరిస్థితి. వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చితో పాటు ఇతర పంటలు నీటిపాలవుతున్నాయి. గోదావరి నుంచి ఎటూ రెండు కిలోమీటర్ల పరిధిలో రైతులు పొలాల్లో నిల్వ ఉంచిన ఎరువుల బస్తాలు, కరెంట్​ మోటార్లు కొట్టుకుపోతున్నాయి.

రెండేళ్లుగా ఇదే పరిస్థితి
ఈ ప్రాజెక్టు బ్యాక్ వాట‌ర్ విష‌యంలో రెండేళ్లుగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ప‌లువురు రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో రెండు ఏండ్ల నుంచి ఇదే పరిస్థితి ఏర్పడింది. గోదావరి, ప్రాణహిత బ్యాక్​ వాటర్​తో పంటలు తుడిచిపెట్టుకుపోయాయ‌ని అధికారులు పంటనష్టం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక‌ పంపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పైసా ఇయ్యలేదు. నష్టపరిహారం రాక, అప్పులు తీర్చేదారి లేక మంచిర్యాల జిల్లాలో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాజెక్టులు నిండితే బ్యాక్​ వాటర్​ పంటలను ముంచుతుందని, ఎప్పటికప్పుడు గేట్లు ఓపెన్​ చేసి తమ పంటలు మునగకుండా చూడాలని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కంటి తుడుపు చ‌ర్య‌గా ప్ర‌తిప‌క్ష నేత‌లు..
ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోయినా ప్ర‌తిప‌క్ష నేత‌లు త‌మ వైపు నిల‌బ‌డి పోరాటం చేయాల‌ని రైతులు కోరుకుంటారు. కానీ, ఇక్క‌డ ప్ర‌తిప‌క్ష నేత‌లు సైతం రైతుల గోస క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు అడ‌పాద‌డ‌పా ఆందోళ‌న‌లు చేసినా రైతులకు న్యాయం చేయ‌డం లేదు. గతంలో రైతుల‌ను ఢిల్లీకి తీసుకు వెళ్తా అని బీజేపీ నేత వివేక్ వెంక‌ట‌స్వామి హామీ ఇచ్చారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఆ విష‌యం ప‌ట్టించుకోలేదు. ఇప్ప‌టికైనా ఆ రైతుల‌కు న్యాయం జ‌రుగుతుందో లేదో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like