మురికి నీళ్ల‌లోనే మున‌క‌..

-భ‌క్తుల‌కు ప‌రీక్ష పెడుతున్న గోదావ‌రి స్నానాలు
-క‌నీస సౌక‌ర్యాలు లేక ప్ర‌జ‌ల ఇబ్బందులు
-మ‌హిళ‌లు దుస్తులు మార్చుకునే స‌దుపాయం లేదు

Manchiryal: మంచిర్యాల‌లో గోదావ‌రి స్నానం అంటేనే భ‌క్తుల‌కు ప‌రీక్షగా మారింది. అక్క‌డ స్నానాలు చేస్తున్న భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. బుర‌ద నీళ్ల‌లోనే ముక్కు మూసుకుని మున‌క వేయ‌డం త‌ప్ప అక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ దినం సంద‌ర్భంగా మంచిర్యాల గోదావ‌రి పుష్క‌ర్‌ఘాట్ లో స్నానాలు చేస్తున్న భ‌క్తులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. గోదావ‌రి తీరం అంతా బుర‌ద‌మ‌యంగా మారింది. దీంతో చాలా మంది భ‌క్తులు ఆ బుర‌ద‌లోనే న‌డుచుకుంటూ వెళ్లి స్నానాలు చేయాల్సిన ప‌రిస్థితి. మ‌రీ ముఖ్యంగా నీరంతా బుర‌ద మయంగా మార‌డంతో అందులోనే స్నానాలు చేయాల్సిన దుస్థితి. శ‌నివారం శివ‌రాత్రి కావ‌డంతో శుక్ర‌వారం వేలాది మంది భ‌క్తులు స్నానాలు చేసేందుకు వ‌చ్చారు. వారికి ఎక్క‌డా క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌లేదు.

ముల్క‌ల్ల పుష్క‌ర్‌ఘాట్ ముసివేసార‌న్న వార్త‌ల‌తో చాలా మంది మంచిర్యాల పుష్క‌ర‌ఘాట్‌కే వ‌చ్చారు. కానీ, ఇక్క‌డ అసౌక‌ర్యాల న‌డుమ అసంతృప్తిగానే స్నానాలు ముగించుకుని వెళ్లిపోయారు. చాలా మంది భ‌క్తులు బుర‌ద‌లో కాలు జారి ప‌డిపోయారు. ఇక‌, వృద్దుల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. కాలు తీసి అడుగువేయాలంటేనే ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక‌, ఆడ‌వాళ్లు త‌మ దుస్తులు ఎక్క‌డ మార్చుకోవాలో తెలియ‌క చీర‌లు అడ్డం పెట్టుకుని మార్చుకోవాల్సిన దుస్థితి. గోదావ‌రి ఒడ్డున రూంలు ఉన్న‌ప్ప‌టికీ అందులో నుంచి దుర్వాస‌న వ‌స్తోంది.

ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం గోదావ‌రి తీరానికి వెళ్లి ఏర్పాట్లు ప‌రిశీలించారు. మ‌రి ఆయ‌న ప‌ర్య‌ట‌న త‌ర్వాత అయినా తీరం తీరు మారుతుందో..? లేక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ప్ర‌జ‌ల గోస త‌మ‌కెందుకులే అని చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారో చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like