బీఆర్ఎస్‌లో భ‌గ్గుమ‌న్న వ‌ర్గ‌పోరు..

-బోథ్ బీఆర్ఎస్‌లో త‌గ్గ‌ని గ్రూపుల గోల‌
-రెండు వ‌ర్గాల మ‌ధ్య పోటాపోటీ స‌మావేశాలు
-ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు

Telangana BRS: బోథ్ బీఆర్ఎస్‌లో గ్రూపుల గోల త‌గ్గ‌డం లేదు. కొన్ని రోజులుగా గ్రూపులు కొన‌సాగుతుండ‌గా, ఆదివారం ఈ పోరు మ‌రింత వేడెక్కింది. రెండు వ‌ర్గాలు పోటాపోటీ స‌మావేశాలు ఏర్పాటు చేసుకోవ‌డంతో అటు కార్య‌క‌ర్త‌ల్లో అయోమ‌యం నెల‌కొంది. ఎమ్మెల్యే త‌మ స‌మావేశం అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఎంపీపీ వ‌ర్గం ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో వ‌ర్గ‌పోరు కొనసాగుతోంది. ఇక్క‌డ బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. దీంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఎంపీపీ తుల శ్రీనివాస్ మధ్య వర్గపోరు కొన‌సాగుతోంది. ఈ విష‌యం గతంలో అధిష్టానం దృష్టికి వెళ్ల‌డంతో వారికి న‌చ్చ‌చెప్పారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు లేకుండా చూసుకోవాల‌ని అధిష్టానం ఇద్ద‌రికి చెప్పింది. దీంతో చాలా రోజులుగా ఇరువ‌ర్గాల నేత‌లు సైలెంట్ అయ్యారు. అయితే, స‌ర్దుకుంది అనుకున్న గ్రూపుపోరు ఆదివారం మళ్లీ తెరపైకి వ‌చ్చింది.

బోథ్ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దానికి పోటీగా ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో మండల కేంద్రంలోనే భరోసా పేరుతో మరో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకే మండలం రెండు సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయ‌డంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎంపీపీ తులా శ్రీ‌నివాస్‌ తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్ కి తాళం వేయించారు. దీంతో పరిచయ గార్డెన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆవేశంతో నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు చేసింది ఏమీ లేద‌ని.. అందుకే పార్టీలో అస‌లైన కార్య‌క‌ర్త‌లు అంద‌రం తులా శ్రీ‌నివాస్ వైపు నిల‌బ‌డ్డామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న విలువ త‌గ్గుతుంద‌ని త‌మ సమావేశం అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యే రూ. 2ల‌క్ష‌లు ఇచ్చిన వారికి డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. కార్యకర్తలు, నాయ‌కుల అభీష్టం మేరకే సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ తులా శ్రీ‌నివాస్‌ చెప్పుకొస్తున్నారు. ఎంపీపీ తులా శ్రీ‌నివాస్ వెనక సీనియర్లు ఉండి కథ నడిపిస్తున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే అంటే లెక్కలేకుండా ఎంపీపీ తులా శ్రీ‌నివాస్ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం తగదని ఎమ్మెల్యే వర్గం నాయకులు హెచ్చరిస్తున్నారు . పోటా పోటీగా సమావేశాలు ఏర్పాటు చేయడం అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like