హ‌రీష్‌కు వైద్య శాఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హ‌రీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ అద‌నంగా కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ తమిళి సై సంతకం చేశారు. కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వ‌ర‌కు ఈ శాఖ ముఖ్య మంత్రి కేసీఆర్ వ‌ద్ద ఉండేది. దీనికి ముందు ఈటెల రాజేంద‌ర్‌ వైద్య ఆరోగ్య శాఖ కు మంత్రి గా వ్య‌వ‌హ‌రించే వారు.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులుగా ఐదువేలు, అంతకన్నా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారు. వేరే వారికి కేటాయించే బ‌దులు మంత్రి హరీశ్​రావుకు అప్పగించేందుకు మొగ్గు చూపిన ముఖ్య‌మంత్రి ఆ శాఖ‌ను ఆయ‌న‌కే అప్ప‌గించారు.

కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖను మరొకరికి కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కొత్త వారికి అప్పగిస్తారన్న చర్చలు సైతం సాగాయి. ఈటల రాజేందర్​ను కేబినెట్​నుంచి బర్తరఫ్​ చేసినప్పటి నుంచీ సీఎం కేసీఆరే ఆ శాఖను చూస్తున్నారు. కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమైన హరీశ్​.. ఇప్పుడు ఆరోగ్య శాఖ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వరుసగా సీఎం నిర్వహిస్తున్న హెల్త్ రివ్యూ మీటింగ్​లన్నింటిలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ట్రబుల్‌ షూటర్‌నే రంగంలోకి దింపుతున్నట్లు కొద్ది రోజులుగా చ‌ర్చ సాగుతోంది. దీనికి బ‌లం చేకూరుస్తూ ఆ శాఖ‌ను అప్ప‌గించారు.

ఇరిగేష‌న్ శాఖ‌ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్‌ పనితనం ఏంటో అందరూ చూశారు. ముఖ్యమంత్రి అనుకున్న రీతిలో పని చేశారు. ఇప్పుడు అదే రీతిన వైద్య ఆరోగ్య శాఖను ఆయనకే అప్పగిస్తే త‌న పని తీరుతో ఆ శాఖ‌కు మంచి పేరు తెస్తార‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్​రావుకు ఈ బాధ్య‌త అప్ప‌గించారు. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా మంత్రి కేటీఆర్​కు కూడా సీఎం మరో బాధ్యత అప్పగించారు. వ్యాక్సిన్, మెడిసిన్​ కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ కమిటీకి కేటీఆర్​ను చైర్మన్​గా నియమించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like