ఆయ‌నే సీఎం

Revanth Reddy: సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో కొత్త సీఎం ఎవరు అనేది తేలిపోయింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు అధిష్టానం ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి పేరును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.

సోమవారం నుంచి కసరత్తు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానానికి పంపించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రేవంత్ పేరును ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్ర నాయకులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పిలుపునివ్వగా ఆయన ఫ్లైట్‌లో వెళుతున్న క్రమంలోనే ముఖ్యమంత్రి ప్రకటన వచ్చింది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నా.. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికే అవకాశం కల్పించింది. “టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. పార్టీలోని సీనియర్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అంతా ఒక టీమ్‌గా పనిచేస్తారు. డైనమిక్ లీడర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎల్లుండి రేవంత్ ప్రమాణ స్వీకారం ఉంటుంది..” అని కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని తన నివాసంలో ప్రకటించారు.

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. కాంగ్రెస్ నుంచి తొలి సీఎంగా ఆయన సరికొత్త చరిత్ర లిఖించారు. టీపీసీసీ చీఫ్ సీఎం కాలేరనే ఆనవాయితీకి కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. మాటలే కాదు చేతల్లోనూ దూకుడు, మంచి వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే తీరు, పదునైన రాజకీయ వ్యూహాలు, విమర్శించిన వారిని సైతం మచ్చిక చేసుకునే నైజంతో రేవంత్ మాస్‌ లీడర్‌గా ఎదిగారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు దీటుగా ప్రసంగాలు ఇస్తూ.. కేటీఆర్, హరీష్ రావు వంటి లీడర్లను గట్టి కౌంటర్లు ఇచ్చారు. అన్ని వెరసి రేవంత్‌ను సీఎం పీఠంపై కూర్చొబెట్టాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like