ఆమె మాట‌లు.. మంట‌లు…

-ఖానాపూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌
-సోష‌ల్ మీడియాలో ఆడియో వైర‌ల్‌

ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఓ నేత‌ను తిడుతూ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఎమ్మెల్యే రేఖనాయక్ దుర్భాషలతో ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారంటే…

నిర్మల్ జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్నఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలానికి చెందిన కళ్యాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ యువ‌తి చ‌నిపోయిన ఇల్లు ఓ ప్ర‌ముఖ టీఆర్ఎస్ నేత ఇల్లు కావ‌డంతో అది కాస్తా వివాదానికి దారి తీసింది. కళ్యాణి మృతి పట్ల దళిత, గిరిజన సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు.

ఈ విషయమై బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ బన్సీలాల్ రాథోడ్ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. బాధిత యువ‌తి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. డిగ్రీ చదువుతున్న గిరిజన యువతిది ఆత్మహత్య కాదు అది హత్యేనని ఆయన ఆరోపించారు. ఆ ఇల్లు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఓ ప్రముఖ టీఆర్ఎస్ పార్టీ నాయకునికి సంబంధించిన ఇల్లు అని, కళ్యాణి మృతిపై రేఖానాయక్ స్పందించకపోవడం సరికాదని బన్సీలాల్ రాథోడ్ దుయ్య‌బ‌ట్టారు.

ఆ వాఖ్య‌ల‌ను తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆ నాయ‌కుడికి కాల్ చేసి బూతులు తిట్టింది. ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్య‌లు చేయడం పట్ల ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో దళిత సంఘాలు ఆందోళన, ధర్నా నిర్వ‌హించారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాటలను జిల్లా దళిత గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఎమ్మెల్యే ఫోన్ కాల్ వ్యాఖ్యలపై బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ బన్సీలాల్ రాథోడ్ మాట్లాడుతూ తాను ఒక గిరిజన వర్గానికి చెందిన వ్యక్తినని త‌న‌ను ఓ శాసనసభ సభ్యురాలు రేఖా నాయక్ ప‌రుష‌, ప‌ద‌జాలంతో దూషించ‌డం స‌రికాద‌న్నారు. ఇది సమంజసమేనా అంటు ప్రశ్నించారు ఎమ్మెల్యే దళిత, గిరిజన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like