మ‌త‌మార్పిడి చేస్తే బుల్లెట్లు దించుతాం

-పోడు భూములు చేసుకునే వారికి అండ‌గా ఉంటా
-ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు హెచ్చ‌రిక‌

Mp Soyam Bapu Rao: ఆదివాసీ బిడ్డ‌ల‌ను మోస‌గించి మ‌త మార్పిడి చేసేందుకు య‌త్నిస్తే బుల్లెట్లు దించుతామ‌ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఘాటుగా హెచ్చ‌రించారు. ఆదిలాబాద్ రాంలీలా మైదానంలో జ‌న‌జాతి సుర‌క్ష మంచ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌భ‌కు హాజ‌రైన సోయం బాపురావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆడపిల్లలను మత మార్పిడి చేస్తున్నారని పద్దతి మార్చుకోక‌పోతే బుల్లెట్లు దించే సమయం వస్తదన్నారు. ఆ పరిస్థితి రానియ్యవద్ద‌ని హెచ్చరించారు.

కొన్ని వ‌ర్గాల వారు ఆదివాసీ మహిళ‌లను బలవంతంగా పెళ్ళిల్లు చేసుకుంటున్నారని అన్నారు. ఉమ్మ‌డి జిల్లావ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1200 మంది మతం మారిన‌ట్టుగా తెలుస్తోంద‌న్నారు. మాయ‌మాట‌లు న‌మ్మి ఆదివాసీ మ‌హిళ‌లు మోస‌పోవ‌ద్ద‌న్నారు. వీరి మూలంగా అస‌లైన ఆదివాసీ బిడ్డ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాద‌ముంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇటువంటి ప‌రిణామాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు, ఆదివాసీ గిరిజ‌నుల హ‌క్కులు, సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కాపాడుకునేందుకు ఈ స‌భ‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. మత మార్పిడి అయిన వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పార్లమెంట్ లో మాట్లాడతా. ఖ‌చ్చితంగా బిల్లు పెట్టి తీరుతానంటూ సోయం వ్యాఖ్యానించారు.

పోడు భూములకు అడ్డువస్తే వారి పైనే కేసులు పెట్టాలంటూ ఎంపీ ఆదివాసీల‌కు పిలుపునిచ్చారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటే తిరిగి కేసులు పెట్టాల‌న్నారు. పోడు భూముల పోరాటం చేసే వారిని తాను అండగా ఉన్నానని వారికి భ‌రోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం కోయ పోచ గూడ ఆదివాసీలకు అండగా ఉన్నాన‌ని అన్నారు. ఆదివాసీలు రావణుని పూజిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని సోయం బాపురావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలా ప్రచారం చేసే వారిని నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు. ఆదివాసీలు రావణునిడి ని పూజిస్తే రాముడు, హనుమాన్ దేవాలయాలు ఎందుకు ఉన్నాయని ప్ర‌శ్నించారు.

అంత‌కుముందు మ‌తం మారిన ఆదివాసీల‌ను ఎస్టీ జాబితా నుండి తొల‌గించాల‌ని ఆదిలాబాద్ లో గిరిజ‌న సాంస్కృతిక ప‌రిర‌క్ష‌ణ పేరుతో ర్యాలీ చేప‌ట్టారు. ఆదివాసీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన ఈ ర్యాలీలో పెప్రే, కాలికోం, బూర‌, డోలు వాయిద్యాలు, ఆదివాసీల‌ నృత్యాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అనంత‌రం స‌భ ప్రాంగ‌ణానికి చేరుకుని ఆదివాసీల ఆరాధ్య‌దైవాలు, పోరాట యోధుల చిత్ర‌ప‌టాల‌కు ప్రత్యేక పూజలు నిర్వ‌హించి, జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి స‌భ‌ను ఆరంభించారు. మతం మారిన ఆదివాసీల‌ను ఎస్టీ జాబితా నుండి తొల‌గించి వారికి వ‌ర్తించే రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హారాష్ట్రకు చెందిన‌ ఎమ్మెల్యేలు కేరం భీంరావు, సందీప్ దుర్వే, జనజాతి సురక్షామంచ్ జాతీయ, రాష్ట్రస్థాయి ప్రతినిధులు, తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి ఆదివాసీలు భారీగా తరలివ‌చ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like