ఇక యుద్ధమే…

మీరు చేయాల్సింది మీరు చేయండి.. మిగ‌తాది మాకు వ‌దిలేయండి- కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలన్న అమిత్ షా - బియ్యం కుంభకోణాన్ని బట్టబయలు చేయాలని సూచన

కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని పార్టీ అగ్రనేత అమిత్ షా పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై యుద్ధం చేయాలని పార్టీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా త‌మ‌పై నిత్యం ఆరోప‌ణ‌లు చేస్తున్న కేసీఆర్‌పై వ్య‌తిరేకంగా వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలని నేత‌ల‌ను కోరారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

హుజూరాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయభేరి మోగించాలని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి… ప్రభుత్వ పరంగా ఏంచేయాలో మాకు వదిలేయండి అని ఉద్బోధించారు. ఇకపై తెలంగాణలో తరచుగా పర్యటిస్తానని పార్టీ వర్గాలకు హామీ ఇచ్చారు.

బీజేపీపై టీఆర్ఎస్ చేసే ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని పార్టీ నేతలకు అమిత్ షా సూచించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో నిత్యం ప్రచారం చేయాలన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే తరహాలో ఇతర కార్యక్రమాలను చేపట్టాలని అమిత్ షా సూచించారు.

అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ ఉంటుందని సమాచారం. అమిత్ షాను కలిసిన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు ఉన్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like