ఇలాగే మున్ముందుకు..

-వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి
-3 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
-ఐదేళ్ల లో 50 వేల టర్నోవర్‌
-ఇతర రాష్ట్రాల్లోకి గనుల విస్తరణ తథ్యం
-సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సింగ‌రేణి అద్భుతమైన ప్ర‌గ‌తిప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని, ఇదే ఒర‌వ‌డితో ముందుకు సాగుదామ‌ని సింగ‌రేణి సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సింగ‌రేణి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న సింగరేణి ఇప్పటికే తగినంత బొగ్గు, విద్యుత్‌ అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు చేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోందని స్ప‌ష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధన దిశగా కృషి చేయనున్నామని ఆయ‌న వెల్ల‌డించారు. 2014లో 50 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 65మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేసిందన్నారు. అప్పుడు 11వేల కోట్ల టర్నోవర్‌ ఉండగా గత ఏడాది 26 వేల కోట్లకు పెరిగిందన్నారు. లాభాలు కూడా గణనీయంగా పెరిగాయని స్ప‌ష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న గనుల్లో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్‌ లను చేపట్టాలని నిర్ణయించామని, ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి మరో మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత న్యూ పాత్ర పాద గనిని కూడా ప్రారంభిస్తామ‌న్నారు. పర్యావరణ హిత బొగ్గు రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వేతో కలిసి రూ.927 కోట్ల తో నిర్మించిన 54 కిలోమీటర్ల పొడవైన కొత్తగూడెం – సత్తుపల్లి రైల్వే లైన్‌ ను దేశంలోనే రికార్డు స్థాయిలో, అతి తక్కువ సమయంలో పూర్తి చేశామని స్ప‌ష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో 10 కొత్త గనులను ప్రారంభిస్తామ‌న్నారు. తద్వారా 100 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోబోతున్నట్లు ప్రకటించారు.

సింగరేణికి పటిష్టమైన ఆర్థిక పునాదులు ఏర్పరచాలన్న ఉద్దేశంతో థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ రంగాల్లోకి కూడా ప్రవేశించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రానికి అదనంగా 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ ను రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, అలాగే సోలార్‌ విద్యుత్‌ ను కూడా ప్రస్తుత 300 మెగావాట్ల నుంచి 1000 మెగావాట్లకు పెంచడానికి సన్నాహాలు ప్రారంభించామన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా సింగరేణి సంస్థ దేశంలోనే ఒక అగ్రగామి కంపెనీగా ఉందని పేర్కొంటూ తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 18,287 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, వీటిలో కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద 13,869 మందికి, డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా 3,763 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇవే కాకుండా ప్రత్యక్ష నియామకం ద్వారా 665 ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ లో పనిచేస్తూ ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన తాడబోయిన శ్రీనివాస్‌(డీజీఎం మార్కెటింగ్‌), పురుషోత్తమాచార్యులు(సీనియర్‌ అకౌంటెంట్‌), బి.ఆనంద్‌ (జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌), పి.సునీల్‌ (పీఏ టు ఛైర్మన్‌)లను సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ సన్మానించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు అడ్వైజర్లు డి.ఎన్‌.ప్రసాద్‌ (మైనింగ్‌), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ),ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కోల్‌ మూమెంట్‌) జె.అల్విన్‌, జీఎం(కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్‌) ఎం.సురేశ్‌, సీఎంవోఏఐ జనరల్‌ సెక్రటరీ ఎన్‌.వి.రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఎన్‌.భాస్కర్‌, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like