ఆ మంత్రి నా దోస్త్‌..

-రాజ‌కీయంగా పేరు వాడుకుంటున్న డాన్‌
-అధికారులను కొంటున్న‌డు... మంత్రి పేరు వాడుతున్న‌డు
-కోట్ల‌ల్లో సాగుతున్న అక్ర‌మ బియ్యం దందా

Illegal rice racket running in crores: ఆ మంత్రి నా దోస్త్‌.. మీరు బియ్యం ప‌ట్టుకున్నా… ఏం చేయ‌లేరు. అన‌వ‌స‌రంగా గొడ‌వ పెట్టుకుంటారా..? ఇచ్చిన డ‌బ్బులు తీసుకుని గ‌మ్మున ఊరుకుంటారా..? ఇది బియ్యం మాఫియా డాన్ హెచ్చ‌రిక‌లు. రాజ‌కీయ బ‌లం, ఆర్థికంగా అండ‌దండ‌లు ఉండ‌టంతో కోట్లాది రూపాయ‌ల విలువైన రేష‌న్ బియ్యం స‌రిహ‌ద్దులు దాటుతోంది. ఎవ‌రైనా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలని ప్ర‌య‌త్నిస్తే ఉన్న‌తాధికారులు వారికి మోకాల‌డ్డుతున్నారు.

మ‌హారాష్ట్రలోని సిర్వంచ‌కు మంచిర్యాల‌, కొమురంభీమ్ ఆసిఫాబాద్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి జిల్లాల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున బియ్యం ర‌వాణా అవుతోంది. సిర్వంచ‌లో ఏకంగా పెద్ద డెన్ ఏర్పాటు చేసిన ఓ డాన్ ఈ రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా ప్రోత్స‌హిస్తున్నాడు. అత‌నికి పెద్ద ఎత్తున రాజ‌కీయ అండ‌దండ‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన అత‌ను మ‌హారాష్ట్రలోని సిర్వంచ‌కు వెళ్లాడు. అక్క‌డ నుంచే పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నాడు.

అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒక‌రు ఆ డాన్‌కు పూర్తి స్థాయిలో అండ‌దండ‌లు అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అత‌ని వైపు క‌న్నెత్తి చూడ‌టానికి కూడా అధికారులు జంకుతున్నారు. ప్ర‌తి రోజు ఈ నాలుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున లారీలు వెళ్తున్నాయి. వాటిని సైతం ఇటు పోలీసులు కానీ, అటు ప్ర‌భుత్వ అధికారులు కానీ ప‌ట్టించుకోక‌పోవ‌డం, ప‌ట్టుకోక‌పోవ‌డం వెన‌క ఈ రాజ‌కీయ ఒత్తిళ్లే అనే ప్ర‌చారం సాగుతోంది.

రాజ‌కీయంగా ఎన్ని అండ‌దండ‌లు ఉన్నా ఆ డాన్ అధికారుల‌ను ఏ మాత్రం త‌క్కువ చేయ‌డం లేదు. వారి స్థాయిని బ‌ట్టి మామూళ్లు ముట్ట‌చెబుతున్నాడు. జిల్లాలో ఉన్న సివిల్ స‌ప్లై ఉన్న‌తాధికారుల‌కు ల‌క్ష వ‌ర‌కు, కింది స్థాయి సిబ్బందికి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వ‌ర‌కు ఇస్తున్నాడు. ఇక రెవెన్యూ విభాగంలో సైతం ఉన్న‌తాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వ‌ర‌కు అదే స్థాయిలో ముట్ట‌చెబుతున్నాడు. ఇక పోలీసు అధికారుల‌కు సైతం ముడుపులు ముడుతున్నాయి. హైవేలో ఠాణా ఉంటే ఒక రేటు, లోప‌ల వైపు ఉంటే మ‌రో రేటు.. సీఐలు, ఎస్ఐలు ఇలా అంద‌రికీ ముట్ట‌చెబుతూ త‌న వ్యాపారం సాగిస్తున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like