డాన్ శాసిస్తాడు.. అధికారులు పాటిస్తారు..

-బియ్యం మాఫియా చెప్పిన‌ట్లు న‌డుచుకుంటున్న అధికారులు
-సిర్వంచ‌కు వెళ్తున్న వాహ‌నాల‌కు అంద‌రి గ్రీన్ సిగ్న‌ల్‌
-ప‌ట్టుకునే వాహ‌నాలు కూడా అత‌ని నిర్ణ‌యం ప్ర‌కార‌మే
-రోజూ స‌రిహ‌ద్దు దాటుతున్న వంద‌ల క్వింటాళ్ల బియ్యం

Illegal shipment of ration rice: అత‌ను బెడ్ పై నుంచే శాసిస్తాడు.. ఆయ‌న చెప్పిన‌ట్లుగా సివిల్ స‌ప్లై, రెవెన్యూ, పోలీసు… ఇలా అన్ని విభాగాల అధికారులు న‌డుచుకుంటారు. కేవ‌లం క‌నుసైగ‌ల‌తోనే అక్ర‌మ బియ్యం మాఫియా న‌డిపిస్తున్నాడు. ఆయ‌న‌ను ప‌ట్టుకోవ‌డం మాట ప‌క్క‌న పెడితే ఆలోచించ‌డానికి కూడా అధికారులు ఇష్టప‌డ‌టం లేదంటే బియ్యం మాఫియా ఏ ర‌కంగా న‌డుస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు.

మ‌హారాష్ట్రలోని సిర్వంచ కేంద్రంగా బియ్యం మాఫియా న‌డిపిస్తున్న ఆ డాన్ చెప్పింది వేదం.. చేసింది చ‌ట్టం అన్న విధంగా న‌డుస్తోంది వ్య‌వ‌హారం. తెలంగాణ‌లోని మంచిర్యాల‌, కొమురంభీమ్ ఆసిఫాబాద్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, చివ‌ర‌కు క‌రీంన‌గ‌ర్ నుంచి కూడా రేష‌న్ బియ్యం స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. రేష‌న్ డీల‌ర్ల వ‌ద్ద కొంద‌రు వ్యాపారులు బియ్యం కొనుగోలు చేసి వాహ‌నాల ద్వారా సిర్వంచ‌కు ర‌వాణా చేస్తున్నారు. అక్క‌డ ఏకంగా జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే ఓ రైస్‌మిల్లు వ‌ద్ద పెద్ద ఎత్తున కొనుగోళ్లు న‌డుస్తున్నాయి. అక్క‌డ పెద్ద ఎత్తున కూలీలు ఇదే ప‌ని చేస్తుంటారు. చిన్న చిన్న వాహ‌నాల నుంచి లారీల‌కు బియ్యం ఎక్కించి మ‌హారాష్ట్రలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు ఛ‌త్తీస్‌ఘ‌డ్‌కు సైతం పంపిస్తుంటారు.

ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌లోనూ ఆయ‌న మ‌నుషులే..
అయితే, ఈ ర‌వాణాకు అధికారుల స‌హ‌కారం లేనిదే ఎక్క‌డా కూడా సాధ్యం కాదు. అందుకే సిర్వంచ‌కు చెందిన ఆ డాన్ ఎక్క‌డిక‌క్క‌డ అధికారుల‌తో సాన్నిహిత్యం పెంచుకుని వారికి ముడుపులు అంద‌చేస్తూ త‌న క‌న్నుస‌న్న‌ల్లో న‌డిపిస్తాడు. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌, రెవెన్యూ, పోలీసు అధికారులకు ప్ర‌తి నెలా ఠంచ‌న్‌గా క‌వ‌ర్లు అందుతాయి. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌తో పాటు రెవెన్యూలో అయితే ఏకంగా జిల్లా స్థాయి అధికారులు సైతం ఆ డాన్‌తో దోస్తానా న‌డిపిస్తున్నారు. ఇక పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అయితే ఠాణాను బ‌ట్టి రేటు ఉంటుంది. ఎవ‌రైనా బియ్యం ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే అత‌నికి ముందుగానే తెలిసిపోతుంది. ఎక్క‌డిక‌క్క‌డ అంద‌రినీ అల‌ర్ట్ చేస్తాడు. అన్ని డిపార్ట్‌మెంట్ల‌లో ఉన్న ఆయ‌న మ‌నుషులు ఆ డాన్‌కు స‌మాచారం చేర‌వేస్తుంటారు.

ప‌ట్టుకునే వాహ‌నాలు కూడా అత‌ని నిర్ణ‌యం ప్ర‌కార‌మే
అప్పుడ‌ప్పుడు ప‌ట్టుకునే వాహ‌నాలు సైతం ఆ డాన్ నిర్ణ‌యం ప్ర‌కార‌మే జ‌రుగుతుంటాయి. ఉన్న‌తాధికారుల ఒత్తిడి ఎక్కువ‌యిన‌ప్పుడో, కేసులు లేన‌ప్పుడో అతనికి చెబితే చిన్న చిన్న వాహ‌నాల‌ను ప‌ట్టుకునేలా స‌మాచారం అందిస్తాడు. దీంతో అధికారులు కేసులు న‌మోదు చేస్తున్నారు. అవి కూడా చిన్న కేసులు మాత్ర‌మే న‌మోదు చేస్తున్నారు. ఒక నెల‌, రెండు నెల‌ల పాటు వాహ‌నాలు సీజ్ అవుతాయి. త‌ర్వాత మ‌ళ్లీ విడిపించుకుని దందా కొన‌సాగిస్తున్నారు. వాహ‌నాలు ప‌ట్టుకున్న స‌మ‌యంలో ఆ వాహ‌నాలాపై పెద్ద కేసులు పెట్టి, డ్రైవ‌ర్లు ర‌వాణా చేస్తున్న వారిపై పీడీ యాక్టు లాంటి కేసులు పెడితే త‌ప్ప ఈ బియ్యం ర‌వాణా ఆగ‌ద‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు.

రోజూ స‌రిహ‌ద్దు దాటుతున్న వంద‌ల క్వింటాళ్ల బియ్యం
అన్ని జిల్లాల నుంచి మ‌హారాష్ట్రకు పెద్ద ఎత్తున బియ్యం స‌రిహ‌ద్దు దాటుతున్నాయి. వాట‌న్నింటికి కేంద్రంగా సిర్వంచ ఉండ‌టంతో అక్క‌డే మ‌కాం పెట్టుకుని మ‌రీ తెలంగాణ రేష‌న్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ప్ర‌తి జిల్లా నుంచి రోజూ వంద‌ల క్వింటాళ్ల బియ్యం త‌ర‌లివెళ్తున్నాయంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఏకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ న‌గ‌ర్ ఈ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు కేంద్రంగా మారిందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. క‌లెక్ట‌రేట్ ఎదురు నుంచే నిత్యం వాహ‌నాల్లో రేష‌న్ బియ్యం త‌ర‌లివెళ్తాయి. ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

అత‌న్ని ఎందుకు ప‌ట్టుకోవ‌డం లేదంటే..
ఆ డాన్ ఎక్క‌డ ఉంటాడో తెలుసు… ఏం చేస్తాడో తెలుసు.. బియ్యం కొనుగోళ్లు జ‌రిపే స్థావ‌రం కూడా తెలుసు.. కానీ, తెలంగాణ‌లో అధికారులు మాత్రం ఈ రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనికి ప్ర‌తి నెలా ముడుతున్న ముడుపులే కార‌ణం అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా ఆ డాన్‌పై చ‌ర్య‌లు తీసుకుంటారో…? లేదో..? వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like