ఇసుకాసురులు..

-పెద్ద ఎత్తున ఇసుక అక్ర‌మ ర‌వాణా
-అధికార పార్టీ నేత‌ల అండ‌దండ‌లు
-ఈ అక్ర‌మం వెన‌క‌ మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పెద్ద త‌లకాయ
-అధికారుల నిర్లక్ష్యంతో మ‌రింత‌ యథేచ్ఛ‌గా

సులువుగా డబ్బు సంపాదించడానికి అక్రమార్కులు ఇసుక రవాణాను ఆదాయవనరుగా మార్చుకున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. మంచిర్యాలలో పెద్ద ఎత్తున ఇసుక అక్ర‌మ ర‌వాణా సాగుతోంది. కొంద‌రు అధికార పార్టీకి చెందిన నేత‌లు సైతం ఈ ఇసుక అక్ర‌మ ర‌వాణాను ప్రోత్స‌హిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలో ఇసుకతో లక్షలు దోచేస్తున్నారు. మంచిర్యాల ప‌ట్ట‌ణంతో స‌హా ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున‌ దందా కొనసాగుతుండగా, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కుల దందా కొనసాగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకున్నా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇక్క‌డ క్వారీలకు అవకాశం లేదని మైనింగ్‌ అధికారులు నివేదికలు ఇచ్చారు. దీంతో ఇక్క‌డ అధికారికంగా ఇసుక క్వారీలకు అనుమతులు లభించలేదు. దీనిని ఆసరా చేసుకుని అక్రమార్కులు దందాకు తెరలేపారు. వానకాలంలో ఇటు గోదావ‌రితో పాటు చుట్టు ప‌క్క‌ల ఉన్న వాగుల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోతాయి. చ‌లికాలంలో ప్రవాహం తగ్గడంతో అక్రమార్కులు ఇసుక నిల్వలపై కన్నేసి య‌థేచ్ఛ‌గా ఇసుక ర‌వాణా సాగిస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని రాంనగర్, లక్ష్మీనగర్, ఎన్టీఆర్ న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల నుంచి ప‌దుల సంఖ్య‌లో ట్రాక్ట‌ర్ల ద్వారా ఇసుక త‌ర‌లిస్తున్నారు. గోదావ‌రి తీరంతో పాటు రాళ్లవాగు, పాలవాగు, ఎర్రవాగు, బతుకమ్మవాగు తదితర వాగుల నుంచి ఇసుకను తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఈ ర‌వాణా సాగుతోందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. రాత్రి నుంచి తెల్లవారుజామున వ‌ర‌కు జిల్లా కేంద్రంలోని రహస్య స్టాక్‌ పాయింట్లకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అక్క‌డ నుంచి వివిధ నిర్మాణ పనుల నిమిత్తం వినియోగదారులకు విక్రయిస్తున్నారు. అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేసినప్పుడు మాత్రం ఒక‌టి, రెండు రోజులు దీనిని ఆపేస్తున్నారు. తిరిగి మ‌ళ్లీ ఈ వ్య‌వహారం కొన‌సాగుతోంది. వివిధ శాఖలకు చెందిన కొందరు అధికారులకు ఇసుక దళారులు నెలవారీ మామూళ్లు అందజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలో జ‌రిగే ఈ ఇసుక అక్ర‌మ దందా వ్య‌వ‌హారంలో అధికార పార్టీ నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. వారు వెన‌క ఉండి ఇసుక అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒక‌వేళ అధికారులు ప‌ట్టుకున్నా, వాహ‌నాల‌ను సీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అధికార పార్టీ నేత‌తో ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో అధికారులు సైతం వెన‌క్కి త‌గ్గుతున్నారు. నిత్యం ల‌క్ష‌ల్లో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారం గురించి క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like