చెల‌రేగుతున్న ఇసుక మాఫియా

-సోమ‌వారం రాత్రి త‌ప్పిన ప్ర‌మాదం
-అర్ధరాత్రి అక్రమంగా రవాణా
-అనుమతి లేకున్నా యథేచ్ఛగా తరలింపు
-వ్యాపారుల ధనదాహానికి గుల్ల అవుతున్న గోదార‌మ్మ
-చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

Manchiryal: మంచిర్యాల జిల్లాలో అక్ర‌మ‌ ఇసుక ర‌వాణా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. ఫిర్యాదులు, ప‌త్రిక‌ల్లో వ‌స్తే తప్ప రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అక్రమదందాపై దృష్టి సారించడం లేదు. పట్టపగలు బహిరంగంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంచిర్యాలతో పాటు హాజీపూర్‌, దండేపల్లి, కాసిపేట, భీమిని, కన్నెపల్లి మండలాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు స‌మాచారం. అర్ధరాత్రి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న మాఫియా ఒక్కో ట్రిప్పునకు వేల రూపాయలు వసూలు చేస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటోంది. గోదావరితో పాటు వివిధ మండలాల్లోని వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలిపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మంచిర్యాల ప‌ట్ట‌ణంతో పాటు పాత మంచిర్యాల,హాజీపూర్‌ మండలం గుడిపేట, దండేపల్లి మండలం గుడిరేవుల, కాసిపేట మండలం గోండుగూడెం, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని ఆయా వాగుల నుంచి నిత్యం పెద్ద మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.

చాలా సంద‌ర్భాల్లో ఆ ప్రాంతాల్లోని నేత‌లు, స‌ర్పంచ్‌ల‌తో మాట్లాడుకుంటున్న ఇసుక ట్రాక్ట‌ర్ల య‌జ‌మానులు పెద్ద ఎత్తున త‌ర‌లిస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై విసిగిపోయిన ఆయా గ్రామాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా, చాలా సంద‌ర్భాల్లో ప‌ట్టించుకోవ‌డం లేదు. అర్ధరాత్రి ట్రాక్టర్ల శబ్దాలు, దెబ్బతింటున్న రోడ్లతో జ‌నం నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది.

ఇక ప్ర‌మాదాల సంగ‌తి చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఇసుక ట్రాక్ట‌ర్లు మితిమీరిన వేగంతో వెళ్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకుంటున్నాయి. డ్రైవ‌ర్లు ఎన్ని ట్రిప్పులు కొడితే అంత ఎక్కువ‌గా సంపాదించుకోవ‌చ్చ‌నే ల‌క్ష్యంతో ట్రాక్ట‌ర్ల‌ను న‌డుపుతున్నారు. దీంతో ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సోమ‌వారం రాత్రి రాంగ్ సైడ్‌లో వ‌చ్చిన ఇసుక ట్రాక్ట‌ర్ మంచిర్యాల బ్రిడ్జి ఎక్కే ప్ర‌య‌త్నం చేసింది. ఎదురుగా వ‌స్తున్న కారు సైతం వేగంగా వ‌స్తుండ‌టంతో రెండూ ఢీకొట్టాయి. ప్రాణ న‌ష్టం త‌ప్పినా కారు తుక్కుతుక్కు అయ్యింది.

ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్న ఇసుక ట్రాక్ట‌ర్లపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు. అదే స‌మ‌యంలో ఇసుక అక్ర‌మ ర‌వాణా సైతం అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like