ప్ర‌తీకారం తీర్చుకుని… ప్ర‌పంచ క‌ప్ ముద్దాడేందుకు…

గ‌త టోర్నీలో త‌మ‌కు ప్ర‌పంచ‌కప్‌ను దూరం చేసిన న్యూజిలాండ్‌ను ఓడించి ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్ ప్ర‌పంచ క‌ప్ ముద్దాడేందుకు ఉవ్విళూరుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భార‌త్ న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి పాలైంది. ఇప్పుడు దానికి ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లైంది. బుధవారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత కోహ్లీ, అయ్యర్‌లు సెంచరీలతో కదం తొక్కగా.. తర్వాత షమీ ఏడు వికెట్లతో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ కకావికలం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభించిన హిట్టింగ్‌ రాహుల్ వరకు ఆటగాళ్లంతా కొనసాగించారు. భారత బ్యాటర్ల ధాటికి కివీస్ సీనియర్ బౌలర్.. టిమ్ సౌథీ 10 ఓవర్లలో వంద పరుగులు సమర్పించుకున్నాడు.

న్యూజిలాండ్ ఛేజింగ్ ప్రారంభించ‌గా, ఆదిలోనే షమీ షాక్ ఇఛ్చాడు. డెవాన్ కాన్వే,రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చాడు. దీంతో 39 పరుగులకే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్‌లు పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. తొలుత ఆచీతూచీ బ్యాటింగ్ చేసిన ఈ జంట.. తర్వాత క్రమంగా వేగం పెంచింది. దీంతో 32.1 ఓవర్లలో 222/2తో పోరాడే స్థితిలో నిలిచింది. షమీ వచ్చీ రాగానే.. కేన్ విలియమ్సన్ (69), టామ్ లాథమ్ (0)ను స్వల్వ వ్యవధిలో ఔట్ చేశాడు. కానీ గ్లెన్ ఫిలిప్స్ (33 బంతుల్లో 41)తో కలిసి డేరిల్ మిచెల్ పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో 42.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసి.. మళ్లీ పోటీలోకి వచ్చింది. ఈ దశలో వికెట్ తీసే బాధ్యతను జస్‌ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్‌ను ఔట్ చేశాడు. స్వల్వ వ్యవధిలోనే మార్క్ చాప్‌మన్ (2) కూడా పెవిలియన్ చేరాడు. డేరిల్ మిచెల్‌ (134) ను పెవిలియన్ పంపించిన షమీ.. మిణుకుమిణుకు మంటూ ఉన్న కివీస్ ఆశలను కూడా తొలగించాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీసిన షమీ.. మొత్తంగా ఈ మ్యాచులో 7 వికెట్లు తీశాడు. దీంతో న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. 70 పరుగులతో గెలిచిన భారత్.. సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

ఆదివారం (న‌వంబ‌ర్ 19)న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుతో ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ ఒక్క మ్యాచులో గెలిస్తే చాలు ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్ నిలుస్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like