సింగ‌రేణి ప‌ర్యాటకానికి శ్రీ‌కారం

-తొలి అడుగుగా రామ‌గుండం గ‌నులు, ఎస్టీపీపీ సంద‌ర్శ‌న‌
-మ‌రికొన్ని సింగ‌రేణి సంద‌ర్శ‌ణీయ స్థ‌లాల ఎంపిక‌
-సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ ప్రారంభోత్స‌వంలో డైరెక్ట‌ర్ ఎన్‌.బల‌రామ్‌

Singareni: సింగ‌రేణి ద‌ర్శ‌న్ పేరుతో ఆర్టీసీ త‌న సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని సింగ‌రేణి డైరెక్ట‌ర్‌ (ఫైనాన్స్‌, పి అండ్ పి) ఎన్‌.బ‌ల‌రామ్ అన్నారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ లో సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ బ‌స్సు ప్రారంభోత్స‌వంలో ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్‌, ఎండీ స‌జ్జ‌నార్ తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ద‌క్షిణ భార‌త దేశంలో ప్ర‌గ‌తి వెలుగుల‌కు మూల‌కార‌ణ‌మైన సింగ‌రేణి తెలంగాణ లో అతి పెద్ద ప‌రిశ్ర‌మ అని వెల్ల‌డించారు. ఇక్క‌డి గ‌నుల్లో జ‌రుగుతున్న బొగ్గు ఉత్ప‌త్తి, ప‌ర్యావ‌ర‌ణ హిత చ‌ర్య‌లు చూడాల్సివ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఈ కేంద్రాల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా గుర్తిస్తూ సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ పేరిట ప‌ర్యాట‌క యాత్ర ఏర్పాటు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. దీన్ని ప్ర‌జ‌లందరూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బ‌ల‌రామ్ పిలుపునిచ్చారు.

సింగ‌రేణి లో ఓపెన్‌కాస్టులు, డంప్ యార్డులు, కృత్రిమ స‌ర‌స్సులు , ఎకో పార్కు వంటి అనేక సంద‌ర్శ‌నీయ స్థలాలున్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. భ‌విష్య‌త్తులో వీటిని కూడా సింగ‌రేణి ద‌ర్శ‌న్‌లో చేర్చవ‌చ్చ‌ని సూచించారు. సింగ‌రేణి 13 ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తుండ‌గా.. ఆర్టీసీ 9 ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తోంద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. వినూత్న ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల సౌక‌ర్యం కోసం పాటు పడ‌టం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్శ‌నకు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ ఒక తీపి జ్ఞాప‌కంగా మిగిలిపోతుంద‌న్నారు.

సింగ‌రేణిలో గోదావ‌రిఖ‌ని ప్రాంతంలోని జీడీకే-7 ఎల్ఈపీ గ‌నిలోనూ, సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం, మైన్స్ రెస్క్యూ స్టేష‌న్లో ప్ర‌యాణికుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ బొగ్గు గ‌నుల్లో బొగ్గు వెలిక‌తీత, అలాగే విద్యుత్ త‌యారీ ప్ర‌క్రియ‌ను తెలుసుకోవ‌డానికి ఈ యాత్ర ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి పై రూపొందించిన బ్రోచ‌ర్ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌, డైరెక్ట‌ర్ ఎన్‌.బ‌ల‌రామ్ ఆవిష్క‌రించారు.

కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ మాట్లాడుతూ సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ తోపాటు మున్ముందు మ‌రిన్ని సంద‌ర్శ‌ణీయ స్థలాల‌తో ప్యాకేజీల‌ను తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ బ‌స్సు బుధ‌వారం 28.12.2022 ఉద‌యం 6 గంట‌ల‌కు జేబీఎస్ నుంచి బ‌య‌లు దేరుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించిన సింగ‌రేణి యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like