ఆశావ‌హుల్లో అభ‌ద్ర‌త‌

Congress: కాంగ్రెస్ పార్టీని మొద‌టి నుంచి న‌మ్ముకున్న నేత‌ల్లో అభ‌ద్ర‌తా భావం పెరిగిపోతోంది. టిక్కెట్టు నాకే, బ‌రిలో నేనే ఉంటాన‌ని నిన్న‌టి వ‌ర‌కు న‌మ్మ‌కంతో ఉన్న నాయ‌కుల‌కు స‌డెన్‌గా కొత్త నేత‌ల రావ‌డంతో త‌ల నొప్పులు తెచ్చిపెడుతోంది. క‌ష్ట‌కాలంలో పార్టీని న‌డిపించి క్యాడ‌ర్‌ను కాపాడిన ఆ నేత‌ల్లో ఇప్పుడు ఆందోళ‌న మొద‌లైంది. ప్యారాచూట్ నేత‌ల చేరిక‌తో త‌మ‌కు టిక్కెట్టు వ‌స్తుందో, రాదోన‌నే భయంతో ప‌ట్నంకు ప‌య‌మ‌వుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో భ‌ద్ర‌త లేద‌ని భావిస్తున్న ఆ ఆశావ‌హులు ఎవ‌రు..? వాళ్ల‌కు వ‌చ్చిన క‌ష్ట‌మేంటి..? నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం…

ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. అవ‌సాన‌ద‌శ‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తూ క‌ష్టాలు, న‌ష్టాల‌కు ఓర్చి ఎన్ని అవాంత‌రాలు, అడ్డంకులు ఎదురైనా ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకుంటూ కొంద‌రు నేత‌లు ముందుకు సాగారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డి పార్టీ కోసం శ్ర‌మించారు. ఇలాంటి నాయ‌కులకు కొత్త నేత‌ల రాక పొగ‌బెట్టిన‌ట్ల‌య్యింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌తో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటీవ‌ల కాలంలో ఎన్నిక‌ల కోస‌మే పార్టీలో చేరిన నేత‌ల హ‌డావిడి పెరిగిపోయింది.

ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీసీ అధ్య‌క్షుడు సాజిద్‌ఖాన్‌, పీసీసీ స‌భ్యురాలు గండ్ర‌త్ సుజాత పోటీలో ఉన్నారు. వీరు ముందుండి కాంగ్రెస్ పార్టీని న‌డిపించారు. స‌డెన్ గా ఎన్ఆర్ఐ ఎంట్రీతో వీరు షాక్‌కు గుర‌య్యారు. కంది శ్రీ‌నివాస్‌రెడ్డి రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్రియాంక‌ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. వ‌చ్చీ రాగానే తెగ హ‌డావిడి చేస్తున్నారు. టిక్కెట్టు త‌న‌కే వ‌స్తుంద‌ని, పార్టీకి ఫండ్ ఇచ్చాన‌ని చెబుతున్నారు. తాను రాష్ట్ర నాయ‌కుడిన‌ని చెబుతూ గ‌ల్లీ గ‌ల్లీ తిరుగుతున్నారు. అంత‌టితో ఆగ‌కుండా క్యాడ‌ర్‌ త‌న‌వైపు తిప్పుకుంటున్నారు. జ‌నంలో సైతం నేనున్నాంటూ డ‌బ్బులు వెద‌జ‌ల్లుతూ మ‌హిళ‌ల‌కు కుక్క‌ర్ల పంపిణీ సైతం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు మూడు, నాలుగు నెల‌ల ముందు వ‌చ్చి హ‌డావిడి చేయ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో పాత నేత‌లు ప‌రేషాన్ అవుతున్నారు. సాజిద్‌ఖాన్‌, గండ్ర‌త్ సుజాత‌, మ‌రో నేత సంజీవ‌రెడ్డి అధిష్టానం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు.

ఆసిఫాబాద్ విష‌యానికి వ‌స్తే టికెట్‌ ఆశిస్తున్న వారిలో డాక్టర్‌ గణేష్‌ రాథోడ్‌ ముందు వరుసలో ఉన్నారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో పార్టీని ప‌ట్టుకుని ఉన్నారు. పార్టీని నియోజకవర్గంలో బూత్‌స్థాయి నుంచి మండలస్థాయి వరకు బలమైన క్యాడర్‌తో నింపారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదొక్క‌టి. ఇక్క‌డ పార్టీకి పూర్తిగా బ‌లం ఉండటంతో కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నాయకులు కాంగ్రెస్‌ టికెట్‌పై గురిపెట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ మాజీసర్పంచి మ‌ర్సుకోల‌ సరస్వతీ కూడా కాంగ్రెస్‌లో చేరి ఆమె కూడా టిక్కెట్టు రేసులో నిల‌బ‌డ్డారు. కొత్త‌గా పార్టీలో చేరిన శ్యాంనాయ‌క్ కాంగ్రెస్‌లో చేరి హ‌డావిడి చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌లియ‌దిరుగుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా కొన‌సాగారు. ఆయ‌న సైతం ఆర్టీఏగా ప‌నిచేశారు. మొన్న‌టి వ‌ర‌కు అధికారం అనుభ‌వించి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చి టిక్కెట్టు ఆశించ‌డం ప‌ట్ల పార్టీలోనే అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

ఖానాపూర్ నియోజ‌వ‌ర్గంలో సైతం టిక్కెట్టు ఆశిస్తున్న నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంద్రవెల్లి స‌భ‌తో పార్టీలోకి వ‌చ్చిన వెడ్మ‌బొజ్జు రేవంత్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న పార్టీ ప‌టిష్ట‌త కోసం తీవ్రంగా కృషి చేశారు. అంత‌కుముందు సైతం భ‌ర‌త్ చౌహాన్ తో స‌హా ఒక‌రిద్ద‌రు నేత‌లు పార్టీని అంటిపెట్టుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వెడ్మ‌బొజ్జు ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తూ తిరుగుతున్నారు. అయితే ఎమ్మెల్యే రేఖానాయ‌క్ స‌డెన్‌గా పార్టీలోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆమె త‌న‌కు ఖానాపూర్ టిక్కెట్టు ఇస్తే పార్టీలోకి వ‌స్తాన‌ని చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాత నేత‌లు అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. ఆమెకు టిక్కెట్టు ఇవ్వొద్ద‌ని నేతలు హైద‌రాబాద్‌లో అధిష్టానం వ‌ద్ద మొర పెట్టుకుంటున్నారు. ఆమెకు టిక్కెట్టు ఇస్తే ఖానాపూర్‌లో ఓట‌మి కొని తెచ్చుకుంటున్న‌ట్ల‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఇలా ప్యారాచూట్ లీడ‌ర్లు గ‌ద్ద‌ల్లా వ‌చ్చి త‌మ టిక్కెట్ల‌ను త‌న్నుకుపోతుండ‌టం పాత నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. దీంతో వీరంతా అధిష్టానం చుట్టూ, త‌మ గాడ్‌ఫాద‌ర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన నేత‌లు మాత్రం ప్ర‌జ‌ల్లో తిరుగుతూ టిక్కెట్టు త‌మకే వ‌స్తుంద‌ని భ‌రోసాతో చెబుతున్నారు. ఇటు కొత్త నేత‌లు ప్ర‌జ‌ల్లో ఉండ‌గా, పాత నేత‌లు ప‌ట్నంలో టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అలా కూడా త‌మ‌కు మైన‌స్ అవుతుందేమోన‌ని భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో కొద్ది రోజుల త‌ర్వాత తెలియ‌నుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like