ఇంటి దొంగ‌ల ప‌నేనా..?

నిత్యం హుండీ దొంగ‌త‌నాలు - రాత్రిళ్లు సైతం పెండ్లిళ్లు - వివాద‌స్పదంగా మారుతున్న అయ్య‌గారి ప‌నితీరు - ఆయ‌న‌కే వ‌త్తాసు ప‌లుకుతున్న దేవాదాయ శాఖ‌ - కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన ఎన్ఆర్ఐ

మంచిర్యాల – బెల్లంప‌ల్లి మండ‌లంలో ఉన్న శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి బుగ్గ దేవాల‌యంలో మ‌ళ్లీ చోరీ జ‌రిగింది. ఇప్ప‌టికే ఇక్క‌డ మూడు సార్లు జ‌ర‌గ్గా ఇలా చోరీ జ‌ర‌గ‌డం నాలుగో సారి. ఇక్క‌డ వ‌రుస చోరీల వెన‌క ఇంటి దొంగ‌ల హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అత్యంత ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన బుగ్గ దేవాల‌యం నిత్యం వార్త‌ల్లోకి ఎక్కుతోంది. ఇక్క‌డ ఏదో ఒక వివాద స్ప‌ద ఘ‌ట‌న‌తో ఆల‌య ప‌విత్ర‌త దెబ్బ‌తింటోంద‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డ హుండీ దొంగ‌త‌నం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. అదే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్రేమ పెండ్లిళ్లు రాత్రి స‌మ‌యాల్లో కూడా నిర్వ‌హిస్తున్నారు. స్థానిక ఆల‌య అయ్య‌గారిపై ఎన్నోమార్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చినా క‌నీసం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు ఆయ‌నకే వ‌త్తాసు ప‌ల‌క‌డం వెన‌క అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

పౌర్ణ‌మి తెల్ల‌వారి హుండీ చోరీలు..
ఇక్క‌డ హుండీ చోరీ ఎప్పుడు జ‌రిగినా పౌర్ణ‌మి రోజుల్లో మాత్ర‌మే జ‌రుగుతోంది. భ‌క్తులు ఆ ప‌ర్వ‌దినాన చుట్టుప‌క్క‌ల నుంచి వ‌స్తుంటారు. ఆ స‌మ‌యంలోనే చోరీ జ‌ర‌గ‌డం ప‌ట్ల అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నాలుగు రోజుల కింద‌ట కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా అదే రోజు హుండీ లెక్కింపు చేయాల‌ని పాల‌క‌వ‌ర్గం భావించింది. కానీ అధికారులు రెండు రోజుల త‌ర్వాత చేద్దామ‌ని చెప్ప‌డంతో ఆగారు. అదే రోజు రాత్రి హుండీ దొంగ‌త‌నం జ‌రిగింది. అలా నిర్ణ‌యం తీసుకున్న విష‌యంలో ఆల‌యంలో వారికి త‌ప్ప వేరే వారికి తెలియ‌దు. మ‌రి తెలిసిన వారే దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారా..? లేక చేయించారా..? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌త ఏడాది హుండీ లెక్కింపు చేస్తే కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే ఉంది. అంటే వేల సంఖ్య‌లో వ‌చ్చిన భ‌క్తులు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే వేశారా..? దానిపై విచార‌ణ చేయాల్సిన అధికారులు క‌నీసం ప‌ట్టించుకోలేదు.

ఇక్క‌డ అయ్య‌గారే అంతా…
బుగ్గ దేవాయ‌లంలో ఉన్న అయ్య‌గారు వేణుగోపాల్ చెప్పిందే వేదం.. చేసిందే చ‌ట్టం అన్న విధంగా త‌యార‌య్యింది. భ‌క్తులు కానుక‌లు ఇస్తే గ‌ర్భ‌గుడిలోకి లేక‌పోతే బ‌య‌ట నుంచి బ‌య‌ట‌కే పంపిస్తార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక వీఐపీలు వ‌స్తే ఆయ‌న చేసే హ‌డావిడి అంతా ఇంతా కాదు. ఇక పెండ్లిళ్ల విష‌యంలో సైతం ఆయ‌న తీరు వివాద‌స్ప‌దంగా మారుతోంది. ప్రేమ పెండ్లిళ్లు రాత్రిళ్లు సైతం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని ప‌లువురు చెబుతున్నారు. వ‌య‌స్సు ధృవీక‌ర‌ణ ప‌త్రం లేకుండా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆయ‌న పెండ్లిళ్లు చేస్తున్నారు. ఇక పెండ్లి ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వాలంటే ముందుగా అయ్య‌గారిని క‌ల‌వాల్సిందే. ఆయ‌న రూ. 5000 నుంచి రూ. 10000 వ‌ర‌కు డిమాండ్ చేస్తారు. ఆయ‌న‌తో మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే ఆ ధృవీక‌ర‌ణ ప‌త్రం వ‌స్తుంది. లేకుంటే లేదు.

దేవాదాయ శాఖ అధికారుల వ‌త్తాసు..
అయ్య‌గారి విష‌యంలో ఎన్నో అక్ర‌మాలు జ‌రుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు ప‌ట్టించుకోకపోవ‌డం ప‌ట్ల అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక్క‌డ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏకంగా వాటిని రికార్డు చేసే డీవీఆర్ సైతం మాయం చేశారు. గ‌తంలో అక్ర‌మాలు చేస్తే ఈజ్‌గాం మ‌ల్ల‌న్న దేవాల‌యం నుంచి అయ్య‌గారు వేణుగోపాల్‌ను ఇక్క‌డ‌కు బ‌దిలీ చేశారు. మ‌రి ఇక్క‌డ కూడా అక్ర‌మాల‌కు చేస్తున్నా చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న అక్ర‌మాల‌కు అధికారులే అండ‌గా ఉంటున్నార‌నే ఆరోప‌ణ‌లు సైతం వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా అయ్య‌గారు వేణుగోపాల్ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులను కోరుతున్నారు.

 

– నిత్యం ఇక్క‌డ దొంగ‌త‌నాలు జ‌రుగుతున్న విష‌యాన్ని బెల్లంప‌ల్లికి చెందిన ఎన్ ఆర్ ఐ కృష్ణారెడ్డి మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఫిర్యాదు చేశారు. నిత్యం దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయ‌ని ఈ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అందులో కోరారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like