ఐపీఎల్ వేలంలో ఇషాన్‌ రికార్డు ధర!

ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది.

గత సీజన్‌లో ఆశించిన మేరకు ఆకట్టుకోనప్పటికీ ఇషాన్‌కు ఈ మేర ముంబై భారీ మొత్తం చెల్లించడం గమనార్హం. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడు ఇషాన్‌ కిషన్‌. అతడి కంటే ముందు వరుసలో క్రిస్‌ మోరిస్‌(16 కోట్లు), యువరాజ్‌ సింగ్‌, ప్యాట్‌ కమిన్స్‌ ఉన్నారు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ బిడ్ వేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ పోటీకి వచ్చింది. ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన ముంబయి రూ.7 కోట్లకి హేజిల్‌వుడ్‌ని ఎగరేసుకుపోయేలా కనిపించగా.. బెంగళూరు సడన్‌గా పోటీకి రూ.7.25 కోట్లకి బిడ్ వేసింది. దాంతో.. ముంబయి మళ్లీ 7.50 కోట్లకి బిడ్ వేయగా.. ఆఖరిగా బెంగళూరు రూ.7.75 కోట్లకి దక్కించుకుంది.

ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్రూ.2 కోట్లతో వేలానికిరాగా.. అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్పోటీపడ్డాయి. చివరికి రూ.10 కోట్లకి గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది.

యువ పేసర్ ప్రసీద్ రూ.1 కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. దాంతో.. అతని కోసం రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. ఆఖరికి రూ.10 కోట్లకి రాజస్థాన్ దక్కించుకుంది.

ఉమేశ్ యాదవ్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకిరాగా.. అతడ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC), సన్‌రైజర్స్ హైదరాబాద్పోటీపడ్డాయి. చాహర్ ధర రూ.10 కోట్లకి చేరగానే.. ఊహించని విధంగా పోటీలోకి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చింది. రూ.13 కోట్లకి చేరగా.. రాజస్థాన్ రాయల్స్ఎంట్రీ ఇచ్చింది. అయితే.. చివరి వరకూ వదలని చెన్నై రూ.14 కోట్లకి దీపక్ చాహర్‌ని దక్కించుకుంది. గత ఏడాది రూ.80 లక్షలకే అతను చెన్నైకి ఆడాడు.

ఫాస్ట్ బౌలర్ నటరాజన్ రూ.1 కోటితో వేలానికిరాగా.. ఫస్ట్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్ వేసింది. ఆ వెంటనే గుజరాత్ టైటాన్స్ కూడా పోటీకి వచ్చింది. దాంతో.. ఈ రెండు ఫ్రాంఛైజీల మధ్య పోటీ నడవగా.. చివరికి రూ.4 కోట్లకి హైదరాబాద్ దక్కించుకుంది.

వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ రూ.1.50 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. అతని కోసం ఫస్ట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్ వేయగా.. చెన్నై సూపర్ కింగ్స్పోటీకొచ్చింది. మధ్యలో కోల్‌కతా ఎంటరవగానే.. చెన్నై ఆగిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పోటీ నడిచింది. చివరికి 10.75 కోట్లకి సన్‌రైజర్స్ దక్కించుకుంది.

భారత టెస్టు వికెట్ కీపర్ సాహా రూ.1 కోటి కనీస ధరతో వేలానికిరాగా.. ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. దాంతో.. అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

భారత సీనియర్ వికెట్ కీపర్ దినేవ్ కార్తీక్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిడ్ వేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి వచ్చింది. చివరికి బెంగళూరు 5.50 కోట్లకి అతడ్ని దక్కించుకుంది.

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో రూ.1.50 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ జరిగింది. చివరికి రూ. 6.75 కోట్లకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడురూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకిరాగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఫస్ట్ బిడ్ వేసింది. వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రంగంలోకి దిగాయి. కానీ.. ఆఖరికి రూ.6.75 కోట్లకి చెన్నై దక్కించుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like