మంత్రి మునుగుడేనా..?

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈసారి ఎదురుదెబ్బ తగలనుందా..? చెరువుల కబ్జాలు, అభివృద్ది మాటున చేసిన అక్రమాలు, వర్షం వస్తే నీట మునిగే నిర్మల్ ఆయనను దెబ్బ కొట్టబోతున్నాయా…? ఇంతకీ నియోజకవర్గంలో గెలుపెవ్వరిది..? మంత్రిని చుట్టుముట్టిన ఆరోపణలు ఈసారి ఆయనను నిండా ముంచనున్నాయా..? నియోజకవర్గ ప్రజల పల్స్ ఏంటి..? నిర్మల్ నియోజకవర్గంలో రాజ‌కీయ స్థితిగ‌తుల‌పై నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం…

రాష్ట్రం దృష్టి నిర్మల్ నియోజకవర్గంపై పడింది. దానికి కారణం ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులే. బీఆర్ఎస్ నుంచి రాజకీయ కురువృద్ధుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన చిరకాల ప్రత్యర్థి మహేశ్వర్రెడ్డి ఈసారి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. రాజకీయ ఉద్దండులుగా పేరున్న ఈ నేతలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా, పార్టీలు ఏవైనా ప్రత్యర్థులుగానే తలపడుతున్నారు. నాలుగుసార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్రెడ్డి ఐదోసారి ఎన్నికల రణంలో ఉన్నారు. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన మహేశ్వర్రెడ్డి వరుస ఓటములు చవి చూశారు.. ఈసారి ఎలాగైనా గెలుపొందే లక్ష్యంతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఆయన బీజేపీలోకి వచ్చి ఆ పార్టీలో సైతం తన బాలాన్ని పెంచుకుని ప్రత్యర్థికి కొరకరాని కొయ్యగా మారారు.

మ‌హేశ్వ‌ర్ రెడ్డి మంత్రి ఐకే రెడ్డి, ఆయన అనుచరులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లొల్లి, గొలుసుకట్టు చెరువు కబ్జాలు, డీ 1 పట్టాల వ్యవహారం, మున్సిపల్ ఉద్యోగాల విక్రయాలు, స్వగ్రామానికి సమీపంలో కలెక్టరేట్ నిర్మాణం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అంతేకాకుండా అభివృద్ధి మాటున జరిగిన అక్రమాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చని తీరు, పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలు, నిర్మల్ పట్టణం ముంపులాంటి వాటిని ప్రధానంగా లేవనెత్తారు. మంత్రి అభివృద్ధి జపం చేస్తుంటే, అభివృద్ది మాటున జరిగిన అక్రమాలను ఆయన తన అస్త్రాలుగా మలుచుకున్నారు. సదర్మాట్ నిర్మాణం.. భూ నిర్వాసితుల సమస్యలు, కాళేశ్వరం 27, 28 సాగునీటి కాల్వల ప్రస్తావిస్తున్నారు.

అనుచరుల ఆగడాలే కొంపముంచుతాయా…?
మంత్రి ఐకే రెడ్డి మితిమీరిపోయిన అతని అనుచరుల ఆగడాలకు కళ్లెం వేయలేదనే అపవాదు ఉంది. జడ్పీ చైర్పర్సన్ భర్త రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మంత్రి పీఏ వ్యవహారాలు మంత్రికి తలనొప్పులు కానున్నాయని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పైరవీలు, లబ్ధిదారుల ఎంపిక విషయంలో చేసిన అక్రమాలు గ్రామాల్లో చర్చకు వస్తున్నాయి. మున్సిపాలిటీలో 41 మంది పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల ఎంపికలో అక్రమాలు గుదిబండగా మారాయి. మంత్రితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు గుప్పుమన్నాయి. దళితబంధు, డబుల్ బెడ్రూం ఎంపిక, వివిధ పథకాల కోసం మంత్రి చుట్టు పక్కల ఉన్న వారు రేట్ ఫిక్స్ చేసి మరీ దండుకున్నట్టుగా ఆడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇలాంటి అంశాలన్నీ మంత్రిని ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టనున్నాయి.

ముంపు పాపం మంత్రిదే..
వర్షం ఎప్పుడు వచ్చినా నిర్మల్ రోడ్లు చిత్తడవుతాయి. కొంచెం ఎక్కువ కురిస్తే ఏకంగా కాలనీలే మునుగుతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీనంతటికీ కారణం గొలుసుకట్టు చెరువుల కబ్జాలేనని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఎఫ్టీఎల్ లెవల్లో నిర్మాణాలపై హైకోర్టు సైతం ఆక్షేపించింది. గతంలో ఉన్న అధికారులను మంత్రి మచ్చిక చేసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగించారనే ఆరోపణలు మంత్రి చుట్టూ వినిపించాయి. నోటిఫికేషన్ వచ్చాక అర్ధంతరంగా కలెక్టర్ ను జిల్లా నుంచి పంపించడం మంత్రి వ్యవహార శైలే కారణం అనే వాళ్లు లేకపోలేదు.

అదే సమయంలో మహేశ్వర్రెడ్డిపై మంత్రి రివర్స్ అటాక్ చేస్తున్నారు. చుట్టపుచూపుగా వచ్చే మహేశ్వర్రెడ్డి పార్టీలు మారే చరిత్ర ఉన్న నాయకులతో ఒరిగేదేమీ లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈసారి జ‌రిగే ఎన్నిక‌లు మంత్రికి ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తున్నాయి. మ‌రి వీట‌న్నింటిని ఎదుర్కొని మంత్రి గ‌ట్టెక్కుతారా..? లేక వ‌రుస ఓట‌ముల‌ను త‌ట్టుకుని సైతం ముందుకు సాగుతున్న మ‌హేశ్వ‌ర్‌రెడ్డి బ‌య‌ట‌ప‌డ‌తారా..? మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది…

Get real time updates directly on you device, subscribe now.

You might also like