ఉద్యోగాలు, ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నాం

-భూములు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు
-ఓపెన్‌కాస్టు ప్రారంభం అయ్యాక మొండిచేయి చూపారు
-సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్కకు మొర‌పెట్టుకున్న ఓపెన్‌కాస్టు బాధితులు
-వ‌చ్చేది ప్ర‌జాప్ర‌భుత్వం, మీ స‌మ‌స్య‌లు తీరుతాయ‌న్న భ‌ట్టి

CLP leader Bhatti Vikramarka : మా భూములు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు.. ఓపెన్‌కాస్టు అయ్యాక మొండిచేయి చూపార‌ని ఓపెన్‌కాస్టు నిర్వాసితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర సంద‌ర్భంగా ఓపెన్‌కాస్టు గ‌నుల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సింగ‌పూర్‌, తాళ్ల‌ప‌ళ్లి, గుత్తరామపల్లికి చెందిన కొంద‌రు ఆయ‌నను క‌లిసి స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. మా గ్రామాల్లోని భూముల‌ను, ఇండ్ల‌ను, అన్నింటిని ఓపెన్ కాస్ట్ లో ప్ర‌భుత్వం తీసుకుందన్నారు. భూముల‌ను తీసుకునే సమ‌యంలో ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారని, ఇప్పుడు స్థానికుల‌కు కాకుండా.. బ‌య‌టి వాళ్ల‌కు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ మూడు గ్రామాల్లో సుమారు 1000 మంది యువ‌కులు ఉద్యోగ, ఉపాధి లేక అవ‌స్థుల ప‌డుతున్నామ‌ని భ‌ట్టి ముందు గోడు వెల్ల‌బోసుకున్నారు. ఇదే సింగ‌రేణి భూగ‌ర్భ గ‌నుల‌ను ఏర్పాటు చేసి ఉంటే అంద‌రికీ ఉద్యోగాలు, ఉపాధి దొరికేద‌న్నారు. ఇక్క‌డ ఓపెన్ కాస్ట్ చేస్తున్న సంస్థ‌.. అధికార పార్టీకి చెందిన చ‌ల్లా ధ‌ర్మారెడ్డికి సంబంధిన వ్య‌క్తుల‌దని, సీఆర్ఆర్ సంస్థ బ‌య‌టివారికి ఉద్యోగాలు ఇవ్వడం వ‌ల్ల స్థానికులు ఉద్యోగ‌, ఉపాధి మార్గాల‌ను కోల్పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగ‌రేణి బొగ్గును ప్రైవేటు ప‌రం చేయ‌డం వ‌ల్ల స్థానికులకు కొలువులు రావ‌డం లేద‌ని చెప్పారు.

వారు చెప్పిందంతా విన్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌స్తుంది.. అప్పుడు అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు కొక్కిరాల సురేఖ‌, చెన్నూరు కాంగ్రెస్ నాయ‌కులు నూక‌ల ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. భ‌ట్టి పాద‌యాత్ర దుబ్బ‌ప‌ల్లి నుంచి రామారావుపేట మీదుగా మంచిర్యాల నియోజ‌క‌వర్గం ప్ర‌గ‌త స్టేడియం చేరుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like