జోగు రామ‌న్న క్ష‌మాప‌ణ‌లు చెప్పు

-రేణుకా సిమెంట్ ఫ్యాక్ట‌రీ పేరుతో భూములు లాక్కున్న‌రు
-రైతుల‌ను రోడ్డు మీద‌కు తెచ్చి చోద్యం చూస్తున్న‌రు
-భూముల‌ను వాపస్ ఇవ్వాల్సిందే
-బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు చిట్యాల సుహాసినిరెడ్డి

ఆదిలాబాద్ : సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని రైతుల వ‌ద్ద భూములు తీసుకుని వాళ్ల‌ను రోడ్డు మీద వ‌దిలేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ‌న్న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, వాళ్ల భూములు వాళ్ల‌కు వాప‌స్ ఇవ్వాల‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమ‌వారం రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల నిర‌స‌న‌కు ఆమె మ‌ద్ద‌తు తెలిపారు. నివాసం నుండి కొమురం భీం చౌరస్తా వరకు కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సంద‌ర్భంగా నిర‌స‌న దీక్ష చేప‌ట్టిన అనంత‌రం మాట్లాడారు. రేణుకా ఫ్యాక్టరీ పేరు మీద భూములు తీసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వాసితుల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర మంత్రి హోదాలో 2018 ఎన్నికల ముందు దసరా దీపావళి మధ్య కొబ్బరికాయలు కొడతామని రామన్న ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెట్టి మోసం చేశార‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద భూములు తీసుకున్నది వాస్తవం కాదా? అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. భూములు తీసుకున్న రైతులకు ఉద్యోగాలు, ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఆశ పెట్టీ భూముల కొనడం వాస్తవం కాదా? పాలభిషేకం చేయించుకోవడం వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. జీవో 40 ప్రకారం భూములు తీసుకున్న మూడేళ్లలో ఫ్యాక్ట‌రీ ఏర్పాటు, సిమెంట్ ఉత్పత్తి కూడా కావాలని చెప్పింది వాస్తవం కాదా? ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన విద్యుత్‌, నీటి వసతి ఏర్పాటు చేయకుండా, భూమి మాత్రమే తీసుకుని ఫెన్సింగ్ చేసుకుని రైతులను రోడ్డు మీదకు తెచ్చార‌ని చెప్పారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా దీని గురించి ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యాడ‌ని తెలిపారు. రేణుకా సిమెంట్ భు నిర్వాసితులకు జోగు రామన్న క్షమాపణ చెప్పి నష్ట పరిహారంతో పాటు భూములను వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like