జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్‌
-జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గణపురంమహేష్, కార్యదర్శి పార్వతిరాజశేఖర్ డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజెఎఫ్ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డిపిఆర్ఓ కృష్ణమూర్తి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మీని కలిసి నూతన కార్య‌వ‌ర్గాన్ని పరిచయం చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడానికి ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందజేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు వారు పనిచేస్తున్న ప్రాంతాలలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డులు అన్ని రకాల ఆస్పత్రులలో వర్తింప చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు నివారించే విధంగా ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ మెంబర్ టి.సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నీలిసతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్, కోశాధికారి కృష్ణమోహన్ గౌడ్ సంయుక్త కార్యదర్శులు సయ్యద్ ఆసిఫ్, శ్రీనివాస్, ఈసీ మెంబర్స్ నాగేందర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like