కార్మిక సంఘాల క‌దం..

రంగంలోకి దిగిన జాతీయ కార్మిక సంఘాలు - డిసెంబ‌ర్ 9 నుంచి మూడు రోజులు స‌మ్మె - బొగ్గు బ్లాకుల ప్రైవేటీక‌ర‌ణ‌తో పాటు ప‌లు డిమాండ్ల‌తో నోటీసు - టీబీజీకేఎస్ నేత‌ల‌తో చ‌ర్చించిన జాతీయ కార్మిక సంఘ నేత‌లు

మంచిర్యాల – బొగ్గు బ్లాకుల వేలం ర‌ద్దు కోసం కార్మిక సంఘాలు క‌దం తొక్కుతున్నాయి. కేంద్రంతో యుద్ధం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘంతో పాటు జాతీయ కార్మిక సంఘాల‌న్నీ పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నిలో స‌మావేశం అయ్యి స‌మ్మెపై చ‌ర్చించాయి. వ‌చ్చే నెల 9 నుంచి స‌మ్మెలోకి వెళ్లాల‌ని కార్మిక సంఘ నేత‌లు నిర్ణ‌యం తీసుకున్నారు.

కేంద్ర కార్మిక వ్య‌తిరేక విధానాలకు వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు ఏక‌మ‌య్యాయి. డిమాండ్ల సాధ‌న కోసం ముందుకు సాగేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌కు చెందిన ముఖ్య నాయకులతో పాటు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌లు సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్‌, బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, టీబీజీకేఎస్ అధ్య‌క్షుడు వెంకట్రావ్‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య పాల్గొన్న స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. సింగరేణికి చెందిన కల్యాణఖని బ్లాక్‌-6, కోయగూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాక్‌లను వేలం వేయ‌డానికి చేస్తున్న కుట్ర‌ల‌ను తిప్పికొట్టేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. టీబీజీకేఎస్‌ సమ్మె నోటీసులోని డిమాండ్లతో పాటు మరికొన్ని డిమాండ్లు చేర్చి యాజమాన్యానికి నోటీసు జారీ చేయాలని జాతీయ కార్మిక సంఘాలు అభిప్రాయం వ్య‌క్తం చేశాయి.

జాతీయ కార్మిక సంఘాలు తొమ్మిది డిమాండ్ల‌తో స‌మ్మె నోటీసు ఇచ్చారు.

1. నాలుగు బొగ్గు బ్లాక్‌ల‌ను ప్రైవేటు వారికి ఇచ్చే నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయాలి. ఆ బావులు సింగ‌రేణికి ఇవ్వాలి.
2. ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు తీసే ప‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు ఇవ్వ‌కుండా నిర్ణ‌యం తీసుకోవాలి. దీనిని ర‌ద్దు చేయాలి. అండ‌ర్ గ్రౌండ్ బావులు మ‌ణుగూరు, కొండాపూర్‌, ఎఎల్‌పీ లాంగ్‌వాల్‌, పీవీకే-5, కేటీకే-8 బావుల్లో బొగ్గు తీసే ప‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు ఇవ్వొద్దు.
3. మైనింగ్ స్టాఫ్‌, ట్రేడ్‌మెన్లు, మెడిక‌ల్ అన్‌ఫిట్ అయితే స‌ర్ఫేస్‌లో అదే జాబ్ ఇవ్వాలి.
4. కోల్ ఇండియాలో మాదిరిగా కంట్రాక్టు కార్మికుల‌కు హైప‌వ‌ర్ క‌మిటీ జీతాలు, కోవిడ్ లేదా గ‌ని ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన వారికి రూ. 15 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
5. పెర్స్క్‌పై ఇన్‌కంటాక్స్ కూడా కోల్ ఇండియాలో లాగా యాజ‌మాన్య‌మే చెల్లించాలి.
6. ముఖ్య‌మంత్రి హామీ ప్ర‌కారం కార్మికుల‌కు సొంత ఇంటి ప‌థ‌కం అమ‌లు చేయాలి.
7. డిపెండెట్ల వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాల నుంచి 40 సంవ‌త్స‌రాల‌కు పెంచాలి.
8. కోవిడ్ వ‌ల్ల బోర్డు ఆల‌స్యం అయిన వారికి మ‌రొక అవ‌కాశం క‌ల్పించాలి.
9. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రు ఉద్యోగులు అయినా ఒక‌రు చ‌నిపోయినా, మెడిక‌ల్ అన్‌ఫిట్ అయినా కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం క‌ల్పించాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like