కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు

ఓసీపీ త్రీ కృషి భవన్ గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావ‌రిఖ‌ని : సింగరేణి కార్మికులను చిన్న చిన్న కారణాలకు వేధిస్తే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కృషి భవన్ లో ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సింగరేణి కార్మికులను అక్కున చేర్చుకుని పని చేయించుకోవాలి తప్ప లెటర్స్ ఇచ్చి భయపెట్టే విధానం మానుకోవాల‌న్నారు. లేకపోతే టిఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ చూస్తూ ఊరుకోద‌న్నారు. అలా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతోంద‌న్నారు. సింగ‌రేణిలో మొత్తం 16 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త త‌మ‌దేన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సింగ‌రేణి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. కార్మికుల‌కు డ్యూటీకి ఇబ్బంది అవుతుంద‌ని, పోతన కాలనీ కాలనీ వరకు రోడ్డు నిర్మించాలని త‌న దృష్టికి తీసుకువ‌స్తే సింగరేణి సీఅండ్ఎండీ తో మాట్లాడి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో బ్రిడ్జి , రోడ్డు నిర్మాణం చేశామ‌న్నారు.

పోరాటాల ద్వారానే బొగ్గు బ్లాక్‌లు సింగ‌రేణికి..
కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణకు పూనుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున గోదావరిఖని చౌరస్తా లో నిరాహార దీక్ష చేశామ‌ని కోరుకంటి అన్నారు. ఆ పోరాటాల ద్వారానే 4 బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకు దక్కే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ప్రాంత కార్మికులు, ప్రజలు కార్పొరేట్ వైద్యం లేకుండా ఇబ్బందులు పడుతుంటే వారి ద‌శాబ్దాల క‌ల తీర్చేందుకు శ్ర‌మించాన‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఎంతో కృషి చేసిన మీదట మెడికల్ కాలేజీ వ‌చ్చింద‌న్నారు. దీనివల్ల సింగరేణి కార్మికులకు కార్మిక కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇటువంటి ప్రయత్నాన్ని కూడా విమర్శించే పార్టీలు యూనియన్ లను ప్రజలే తిప్పికొడతారని చెప్పారు.

టీబీజీకేఎస్‌లో చేరిన కార్మికులు..
ఈ సందర్భంగా మామిడి తిరుపతి ఆధ్వర్యంలో 50 మంది కార్మికులు టీబీజీకేఎస్ యూనియన్ లో చేరారు. వారిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. పెద్దపెల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి కృషి భవన్ వ‌చ్చిన సందర్భంగా కార్మికులు చంద‌ర్‌ను స‌న్మానించారు. కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ రెడ్డి, శంకర్ నాయక్చ ఐ. సత్యం, కృష్ణ, పైడి పెళ్లి ప్రభాకర్ , సిరంగి శ్రీనివాస్, కర్క శ్రీనివాస్, నరసయ్య, రవీందర్ రెడ్డి, అవునురి రాజేశం, లచ్చయ్య, సూర్య శ్యామ్, మేడి సదయ్య, రంగి శెట్టి వెంకన్,న మేకల శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like