క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న సింగరేణి

-ఆసుప‌త్రి పాలైన‌ కార్మికుల కుటుంబాలు
-ప‌రామ‌ర్శించిన టీబీజీకేఎస్ నాయ‌కులు
-జీఎంతో మాట్లాడామ‌న్న మిర్యాల రాజిరెడ్డి

కార్మికుల కోసం వంద‌ల కోట్ల రూపాయాల‌తో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న యాజ‌మాన్యం క‌నీసం మంచినీరే స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోతోంది. దీంతో కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. గోదావరి నుండి వచ్చే నీరు తాగటం వలన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణిలోని పలు కార్మిక వాడలు, కాలనీల వాసులు వాంతులు, విరోచనాలతో సింగరేణి, ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గోదావరి నుంచి సరఫరా అవుతున్న మంచినీరు, మూడు రోజులు గా కలుషితం కావడం అదే నీటిని నీటిని తాగటం వల్ల చాల మంది మంచం పట్టారు. విషయం తెలిసిన జిఎం కల్వల నారాయణ సింగరేణి ఏరియా ఆస్పత్రి కి చేరుకొని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మంచినీరు ఎక్కడ కలుషితమవుతుందో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సివిల్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సూచించారు. మంచినీరును శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపినట్లు జిఎం నారాయణ పేర్కొన్నారు.

నీరు క‌లుషితం అవుతోంద‌ని, స‌రైన ఫిల్ట‌ర్ చేసిన నీటిని పంపించాల‌ని తాము ఎన్నిసార్లు చేసినా ప‌ట్టించుకోలేద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేత‌లు సింగరేణి దవాఖాన లో చేరిన కార్మికుల కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వైద్యాధికారి తో మాట్లాడి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయించడంతో పాటు అవసరమైన మందులను ఏర్పాటు చేయించామ‌ని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు టాంకర్ ద్వారా మిషన్ భగీరథ నీరు అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయాలని కోరారు. కార్మికుల‌ను ప‌రామ‌ర్శించిన వారిలో TBGKS కేంద్ర కమిటీ నాయకులు నూనెకొమురయ్య, వడ్డేపల్లిశంకర్, యాదవ రెడ్డి, కుసుమ స్వరూప, లక్ష్మణ్ రావు ఉన్నారు. తాను ఆర్జీ 1 జీఎం నారాయ‌ణ‌తో మాట్లాడిన‌ట్లు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శాంపిల్స్ సేకరించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు.

సింగరేణి యాజమాన్యం కు ఉత్పత్తి పైన ఉన్న శ్రద్ద కార్మికుల సంక్షేమం మీద లేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.ఇప్పటికైనా నీటి శుద్ది కేంద్రాలు ఏర్పాటు చేసిన స్వచ్చమైన నీటిని సరఫరా చేయాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like