భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఝ‌ల‌క్‌..

-ఏపీ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా రాజీనామా
-వేరే పార్టీలోకి మారేందుకు స‌న్నాహాలు

Kanna Lakshminarayana : భార‌తీయ జ‌న‌తా పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ లేదా జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కన్నా. జాతీయ కార్యకర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. రెండు రోజుల క్రితం అమరావతిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటనలో కూడా కన్నా కానరాలేదు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై ముఖ్య అనుచరులతో చర్చించిన కన్నా.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తనకు ఢిల్లీ నాయకత్వంపై నమ్మకం ఉన్నా రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. తాను ఎన్నిసార్లు చెప్పి చూసినా రాష్ట్ర నాయకత్వం తన మాటకు విలువ ఇచ్చి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తనకు విలువ లేని చోట ఎక్కువ రోజులు ఉండలేనంటూ కొద్ది రోజుల కింద‌టే బాంబు పేల్చారు ల‌క్ష్మీనారాయ‌ణ‌. కొన్ని వారాల నుంచి పార్టీ మారడంపై ఊగిసలాట కొనసాగుతోంది. పార్టీ మార్పు అంశంపై ఇప్పటికే అనుచరులతో చర్చించారు. వారం పది రోజుల కిందటే తన అనచురులు ఆయనకు చెప్పారు కానీ.. పరిస్థితులు చక్కబడతాయని అభిమానులను వారించారు. అదే టైంలో బీజేపీ ముఖ్య నేత‌లు ఆయనతో సమావేశమై చర్చించారు.

ఈ మధ్యే పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శివప్రకాష్‌తో కన్నా లక్ష్మీనారాయణ సమావేశం అయ్యారు. రాష్ట్ర నాయకత్వంలో ఉన్న లోపాలు… రాష్ట్రంలో ఉన్న సమస్యలను వెల్లడించారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిందా సమావేశం. ఆ భేటీ జరిగిన ఇరవై రోజుల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అధ్యక్షుడు సోమువీర్రాజు, జీవీఎల్‌ వర్సెస్‌ కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ నడుస్తోంది. కన్నా వర్గాన్ని పూర్తిగా పట్టించుకోకుండా సోమువీర్రాజు, జీవీఎల్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీకి పనికి వచ్చే కార్యక్రమాలు తీసుకోవడం లేదని క‌న్నా వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉంది.

అయితే ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నేది స‌స్పెన్స్‌గా మారింది. తెలుగుదేశంలోకి వెళ‌తారా..? లేక జ‌న‌సేన‌లోకి వెళ‌తారా…? అనే దానిపై చ‌ర్చ సాగుతోంది. అయితే, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తెలుగుదేశంలోకే వెళ్లేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని వారం ప‌ది రోజుల్లో ఆ ప్ర‌క్రియ కూడా పూర్త‌వుతుంద‌ని ఆయ‌న అనుచ‌ర‌లు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like