క‌ర్ణాట‌క స‌స్పెన్స్‌కు తెర‌

-సీఎం అభ్య‌ర్థిగా సిద్ద‌రామ‌య్య‌
-డీప్యూటీ సీఎంగా డీకే శివ‌కుమార్‌

Karnataka: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ విష‌యాన్ని ప్రకటించారు. అఖండ మెజారిటీతో కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించినా.. సీఎం అభ్యర్థిపై తర్జన భర్జన పడిన కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఊరట లభించింది. హైకమాండ్ బుజ్జగింపులతో కన్నడ కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందారు. దీంతో ముఖ్యమంత్రిగా మరోసారి సిద్ధరామయ్యకే అవకాశం ద‌క్కింది. సీఎం కుర్చీ కోసం చివరి నిమిషం వరకూ తీవ్ర ప్రయత్నాలు చేసిన శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం కర్ణాటక శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి సిద్ధరామయ్యను, సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. 20న సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ మరికొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు.

సిద్దరామయ్య,డీకే శివకుమార్‌ మధ్య సఖ్యత కుదర్చడంతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా విజయం సాధించింది. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా సిద్దరామయ్య,శివకుమార్‌ ఒకరినొకరు కలుసుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో కూడా విడి విడిగా సమావేశం అయ్యారు. కర్ణాటక సీఎం పీఠంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడటంతో ఈ రోజు ఉదయం డీకే శివకుమార్, సిద్దరామయ్యలు కలిసి మల్లికార్జున ఖర్గేతో భేటి అయ్యారు. ఇందుకోసం ఇద్దరు ఒకే కారులో ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో భేటీకి సంబంధించి ఫోటోను షేర్ చేసిన ఖర్గే ‘కర్ణాటక ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీమ్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మేము 6.5 కోట్ల మంది కన్నడిగులకు హామీ ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తామ’ని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like