కాసుల క‌క్కుర్తి.. కొల‌త‌ల్లో మాయ‌…

-బంకుల్లో త‌క్కువ వ‌చ్చిన డీజిల్
-కన్నేపల్లి మండలం హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ లో మోసం
-ఫిర్యాదు చేసినా లైట్ తీసుకున్న అధికారులు
-నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ లేక ల‌క్ష‌ల్లో మోసపోతున్న ప్ర‌జ‌లు

మంచిర్యాల : అసలే పెట్రోల్, డీజిల్ ధరలు మంట మండుతున్నాయి. ఇప్ప‌టికే సెంచ‌రీ దాటిపోయాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రో బంకుల కాసుల కక్కుర్తి.. వాహనదారులకు శాపంగా మారుతోంది. ఇంధన కొలతల్లో మాయ.. పాయింట్ల వారీగా మోసాలు, పెట్రోల్, డీజిల్ తక్కువ రావడం వంటి అనేక ఘటనలు మంచిర్యాల జిల్లాలో వెలుగుచూస్తుండటం… పెట్రో బంకుల నిలువు దగాకు నిదర్శనంగా నిలుస్తోంది.

బంకుల కాసుల కక్కుర్తి… అమ్మకాల్లో మోసాలు
మంచిర్యాల జిల్లాలో ప‌లు చోట్ల పెట్రోల్ బంకుల్లో మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇంధన కొలతల్లో మాయ, పాయింట్ల వారీగా మోసాలు, పెట్రోల్, డీజిల్ తక్కువ రావడం వంటి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ కూలీ నుంచి ఉద్యోగుల వరకు అంతా బంకుల మోసాలకు బలవుతున్న బాధితుల్లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం కన్నేపల్లి మండలంలోని టేకులపల్లి x రోడ్ వద్ద ఉన్న హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ లో ఇలాంటి మోసం వెలుగు చూసింది. ఒక వినియోగ‌దారుడు రూ. 250 డీజిల్ పోయించాడు. రీడింగ్‌లో 2.33 లీట‌ర్లు చూయించ‌గా వారు పోయించిన డ‌బ్బాల్లో పావుత‌క్కువ రెండు లీట‌ర్లు మాత్ర‌మే రావ‌డం గ‌మ‌నార్హం.

అడిగితే పొంతన లేని స‌మాధానాలు..
వినియోగదారుడు బంకు మేనేజ‌ర్‌ని అడిగితే పొంత‌న లేని స‌మాధానాలు చెప్పారు. ఎయిర్ వ‌చ్చింద‌ని అందుకే మీకు త‌క్కువ డీజిల్ వ‌చ్చింద‌నే స‌మాధానం వ‌చ్చింది. దీంతో ఆ వినియోగ‌దారుడు ఫిర్యాదు చేసేందుకు ఇండియ‌న్ ఆయిల్ సేల్స్ ఆఫీస‌ర్ను సంప్రందించేందుకు ప్ర‌య‌త్నించ‌గా అక్క‌డ రాసి ఉన్న నంబ‌ర్ త‌ప్పు అని తేలింది. దీంతో అత‌ను స‌రైన నంబ‌ర్ తెలుసుకుని ఆ అధికారికి కాల్ చేశారు. ఆ అధికారి సైతం తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్ప‌కుండా స‌మాధానం దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో చివ‌రికి వినియోగ‌దారుడు ప‌ట్టుప‌ట్ట‌డంతో సోమ‌వారం వేరే ప‌ని ఉంద‌ని, మంగ‌ళ‌వారం వ‌చ్చి త‌నిఖీలు చేస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

చిప్​తో మోసం…
సాధారణంగా ఒక లీటర్ పెట్రోల్ అమ్మితే రూ. 3, డీజిల్​పై రూ. 2పైనే బంకు నిర్వాహకులకు కమీషన్ ఉంటుంది. ఇది చాలదన్నట్టు అత్యాశకు పోయి కాసుల కక్కుర్తికి మరిగిన కొన్ని బంకుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ వ్యవస్థలోని యంత్రాల్లో చిప్​లు పెట్టి కొలతల్లో భారీ వ్యత్యాసం వచ్చేలా చేస్తున్నారు. ప్రతీ వెయ్యి ఎంఎల్ ఇంధనానికి 100 ఎంఎల్ తక్కువగా వస్తుందని సమాచారం. పెట్రోల్ కొట్టే గన్నులో చిప్ పెడుతున్నారు. రీడింగ్‌లో రూ. 100 చూపించినా.. చిప్ మాత్రం రూ. 90 వద్దే ఆగిపోతుంది. బంకుల్లో భూగర్భ ట్యాంకుల నిర్వహణ సక్రమంగా లేక పెట్రోల్లో నీటి ఛాయలు వస్తున్నాయి. పెట్రోల్​తోపాటు నీళ్లు వస్తున్నాయంటూ.. వాహనదారులు ఆందోళనలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. వాహనదారులు లీటర్ల చొప్పున కాకుండా నోట్ల వారీగా పోయించుకోవడం యజమానులకు కలిసి వస్తోంది.

పర్యవేక్షణ కరవు…
పెట్రోల్ బంకుల నిర్వహణపై విధిగా తూనికలు, కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. ఇంధన విక్రయాలు పారదర్శకంగా సాగేందుకు నెలనెలా తనిఖీలు నిర్వహించాలి. బంకుల్లో మోసాలపై వినియోగదారులు నెత్తినోరు బాదుకుంటున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద తతంగమే సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటు పడ్డ శాఖల అధికారుల తీరుతోనే పెట్రో బంకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు పెట్రోల్ బంకుల్లో సాగుతున్న మోసాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి మోసపోకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like