కేసీఆర్ చేస్తున్న హ‌త్య‌లే : ష‌ర్మిల

నిర్మ‌ల్‌ : రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేస్తున్న హత్యలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం వైఎస్ ష‌ర్మిల రైతు ఆవేద‌న యాత్రలో భాగంగా నిర్మ‌ల్ జిల్లాలో రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ వడ్లు కొనడం చేతగాని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు అప్పులు పెరిగిపోయాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు రాకపోవడంతో బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని అన్నారు. బ్యాంకు అధికారులు కూడా అప్పులు తీర్చాలని రైతులను వేధిస్తున్నారని అన్నారు.

”రైతుల‌ ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకుంటుంటే కంటివెంట నీరు ఆగడం లేదు. రైతులు కనీస సంపాదన లేకపోయినా అప్పులు తీర్చేందుకే వరి పంట వేస్తున్నారు. అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నార”ని అన్నారు. కేసీఆర్ కు రుణమాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హామీనిచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఏడేండ్లలో ఏడువేల మంది, గత 70 రోజుల్లో 200 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంది రైతులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ ప్రతీ రైతుకు భరోసాను కల్పించాలి. కల్లాల్లో ఉన్న ప్రతీ రైతు వడ్లను కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేసారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని స్ప‌ష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పక్కా ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు న్యాయం చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా షర్మిల హామీ ఇచ్చారు. ఈ రైతు ఆవేద‌న యాత్ర‌లో దిలావ‌ర్‌పూర్ మండలంలోని కాల్వ తండాలో బానోత్ అంబర్ సింగ్, సారంగపూర్ మండలంలోని రనపుర్ తండాలో రాతోడ్ శేషురావు, మామ్డ మండలంలోని తాండ్ర గ్రామంలో నాయుడు భీమన్న అనే రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ లోక లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు బెజ్జంకి అనిల్ కుమార్, ఆదిలాబాద్ పార్టీ వ్యవస్థపకులు వాడుక రాజగోపాల్, ముస్తఫా, అయూబ్, ఏపూరి సోమ‌న్న‌, బానోత్ సుజాత, ఉమ్మడి జిల్లా నాయకులు అజయ్ కుమార్, కంచి సతీష్, దుర్గం నగేష్, సలీమ్, సరసం రాహుల్ రెడ్డి, సిడం మురళి కృష్ణ, ఆదిలాబాద్ ఐటీ -సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ యస్వీ సిద్ధార్థ్ నాయక్ , ముత్యం రెడ్డి, ఖానాపూర్ మండల కన్వీనర్ శేషాద్రి, అస్గర్, రైస్, ఇమ్రాన్ ఖాన్, చిలుకూరు మురళి, మహేష్, తక్కలపెల్లి గణేష్,నరేంద‌ర్ పాల్గొన్నారు.

పార్టీలో ప‌లువురి చేరికలు
ముథోల్ నియోజకవర్గం బెజ్జంకి ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ప‌లువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. తెలంగాణ జనసమితి పార్టీ కోఆర్డినేటర్ కిరణ్ రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్రనాయకులు కట్లపురం నవీన్ పార్టీలో చేరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like