కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ‌త‌క‌లేవు

-అధికారం లేకుండా నీ కుటుంబం బ్రతుకలేదు
-నిండా నీళ్లున్నా క‌రువు కాట‌కాల‌తో అల‌మ‌టిస్తోంది
-తెలంగాణ‌లో రైతులు బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతున్న‌రు
-మ‌మ్మ‌ల్ని కొట్టినా, జైళ్లో పెట్టినా కొట్లాట ఆపేది లేదు
-నిప్పులు చెరిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్‌

కాగ‌జ్‌న‌గ‌ర్ : కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ‌తుక‌లేవు.. అధికారం లేకుండా నీ కుటుంబం బ‌తుక‌లేదు.. ఎందుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావ్ స‌మాధానం చెప్పాల‌ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. ఆయ‌న సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ బీజేపీ నేత డా. పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన ప్రాణహిత జల సాధన పాదయాత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కౌటాల మండలం తుమ్మిడి హెట్టీలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పుష్కర ఘాట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నీళ్లకు నిలయం, వర్షాలకు అడ్డా అదిలాబాద్ అన్నారు. గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదుల సంగమ‌న్నారు. అయినా కరువు కాటకాలతో అదిలాబాద్ తూర్పు ప్రాంతం అలమటిస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

2008 కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు రూ. 38 వేల కోట్లతో అంబేడ్కర్ పేరు పెట్టి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం ఈ ప్రాంతాలకు 14 సంవత్సరాలు గడిచిపోయినా కూడా చుక్క నీరు రాలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం పేరుతో ఆఘ‌మేఘాల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పని పూర్తి చేస్తున్నారని అన్నారు. కానీ అసలు మొదలు పెట్టిన ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ప్రాంతంలో కాలువలు తవ్వినా చుక్కనీరు ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టార‌ని అన్నారు. పాల్వాయి హరీష్ రావు ఆరు రోజులుగా పాదయాత్ర చేసి ప్రగతి భవన్ లో ఉన్న పెద్దలకు ఈ ప్రాంత ప్రజల ఆక్రందనలు వినిపించే ప్రయత్నం చేశారని అన్నారు.

కాలువల్లో నీళ్ళు ఉన్నా కేసీఆర్ వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు వేసుకోలేదని, తెలంగాణలో రైతులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారని ఈటెల రాజేంద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒకనాడు పల్లెలు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు అని చెప్పిన కేసీఆర్‌.. ఆ మాట మ‌రిచిపోయార‌ని అన్నారు. పల్లెల్లో అన్నీ వర్గాలను ఆదుకొనేది, ప్రజానీకానికి ఉపాధి కల్పించేది వ్యవసాయం అని… అలాంటి వ్యవసాయాన్ని కేసీఆర్ అయోమయంలో పడేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాటలు ఏవీ నెరవేరడం లేదని అన్నారు. 2018 ఎన్నికల సమయంలో 57 సంవత్సరాలు నిండినవారికి 2 వేలు ఇస్తా అని.. డబ్బాలో ఓట్లు వేసుకొని వారిని వ‌దిలేశార‌న్నారు. రూ. 3016 నిరుద్యోగ భృతి ఏమైందని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. కేసీఆర్ మాటలు గొప్పగా ఉంటాయి చేతలు మాత్రం ఉండవన్నారు. కెసిఆర్ మాటలు చేతలకు పొంతన ఉండదన్నారు.

ఎవ‌రిది బుడ్డ పార్టీ అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు ఈటెల రాజేంద‌ర్‌. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని స్ప‌ష్టం చేశారు. పార్లమెంట్ లో 542 స్థానాలు ఉంటే 303 స్థానాలు బీజేపీ గెలుచుకుందని వెల్ల‌డించారు. రాజ్యసభలో 100 మంది ఎంపీలు, దేశ‌వ్యాప్తంగా 18 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. ప్రజల పక్షాన పక్షిలా, వారి గొంతుక‌లా కొట్లాడుతున్నామ‌ని స్ప‌ష్టం చ‌శారు. మ‌మ్ముల్ని కొట్టినా, జైల్లో పెట్టినా భరిస్తం తప్ప కొట్లాట ఆపేది లేదని వెల్ల‌డించారు. కేసీఆర్ నీ కుట్రలు కుతంత్రాలు చేధిస్తామ‌ని, భారతీయ జనతా పార్టీ నీ అధికారంలోకి తీసుకువస్తామ‌ని చెప్పారు.
ప్రజల సమస్యలు అన్నీ మన ప్రభుత్వంలో తీరుస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో బీజేపీ నేత‌లు వివేక్ వెంక‌ట‌స్వామి, భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షుడు డా. కొత్తపల్లి శ్రీనివాస్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొమ్ము స‌త్య‌నారాయ‌ణ‌, కాగ‌జ్‌న‌గ‌ర్ టౌన్ ప్రెసిడెంట్ గోళం వెంక‌టేశం, మ‌హిళా నాయ‌కులు సుహాసిని, మండల అధ్యక్షులు నరులే వానుపటేల్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like