కేసీఆర్ ప్లాన్ అమ‌లు చేస్తున్న బీజేపీ…

త‌న ఎదుటి వారిని మాన‌సికంగా దెబ్బ‌కొట్టి రాజ‌కీయంగా పై చేయి సాధించ‌డం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎత్తుగ‌డ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అదే వ్యూహాన్ని అవ‌లంబిస్తున్నారు. మొద‌ట‌గా వారిపై మాట‌ల‌తో దాడి చేయ‌డం, వారి చుట్టు ఉన్న వారిని త‌న వైపున‌కు తిప్పుకోవ‌డం చేస్తారు. త‌ర్వాత ఎదుటి పార్టీలో ముఖ్య‌మైన వారిని న‌యానో భ‌యానో త‌మ పార్టీలో చేర్చుకోవ‌డం చిన్న చిన్న పార్టీల‌ను క‌లుపుకోవ‌డం ఇలా ఎన్నో ర‌కాలుగా ఆయ‌న వ్యూహాలు ప‌న్నుతారు. దీంతో ఆయ‌న ధాటికి ప్ర‌తిప‌క్షాలు చాలా ర‌కంగా దెబ్బ‌తిన్నాయి. ఇప్పుడు అదే వ్యూహాన్ని బీజేపీ అమ‌లు చేస్తోంది.

తెలంగాణలో బీజేపీ త‌న వేగాన్ని పెంచింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ముందుగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. పార్టీ అధిష్ఠానం కూడా రాష్ట్ర బీజేపీ నాయకులకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో ఇక్కడి నేతలు దూకుడు పెంచారు. నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగే ఆయా పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ ఆక‌ర్ష్‌ విజయవంతంగా అమలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆ నేత‌ల‌తోనే కేసీఆర్‌పై ఎదురుదాడి చేయిస్తున్నారు. మొద‌ట్లో టీఆర్ ఎస్ గురించి మాట్లాడ‌టం కానీ, కేసీఆర్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పేందుకు సంశ‌యించేవారు. ఈటెల ఎపిసోడ్ త‌ర్వాత సీన్ మారింది. త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ పార్టీ బీజేపీ ఉంద‌ని నేత‌లు సైతం భ‌యాన్ని విడిచిపెట్టారు.

టిక్కెట్టు ఆశించిన భంగ‌ప‌డిన వారే టార్గెట్‌..
తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా బలపడాలనుకుంటున్న బీజేపీ.. టీఆర్ఎస్ కాంగ్రెస్ అసంతృప్త నేతలపై కన్నేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇక స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీకి ఆశపడి భంగపడ్డ టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకు ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ లోనూ విభేదాలున్నాయి. చాలా మంది నాయకులకు పరస్పరం పడడం లేదు. అలాంటి వాళ్లను చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

చిన్న పార్టీల‌ను విలీనం చేసుకునేలా..
ఇప్పటికే అధికార టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న ఉద్యమ నాయకులను పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. స్వామిగౌడ్ రవీందర్ నాయక్ ఈటల రాజేందర్తో సహా కొంత మంది నాయకులు అలా వచ్చినవాళ్లే. వాళ్లకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. తాజాగా విఠల్ కూడా బీజేపీలో చేర‌నున్నారు. ఇలా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని చిన్న పార్టీలను విలీనం చేసుకోవడంపై కూడా బీజేపీ దృష్టి సారించింది. తాజాగా యువ తెలంగాణ పార్టీని కలిపేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర‌కు ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణ రాణి రుద్రమలతో మంతనాలు పూర్తి చేశారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన మరో పార్టీని విలీనం చేసుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like