ట‌చ్ చేయండి.. నా ప‌వ‌ర్ తెలుస్తుంది…

సిల్లి బీజేపీ, సొల్లు బీజేపీ మాట‌లు న‌మ్మెద్దు - కేంద్రానికి చుక్కలు చుక్క‌లు చూపిస్తం - ముఖ్య‌మంత్రి కేసీర్ తీవ్ర ఆగ్ర‌హం

త‌మ‌ది రైతు ప్ర‌భుత్వమ‌ని, రైతుల కోసం ఎన్నో చేశామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఆదివారం సాయంత్రం విలేక‌రుల‌తో మాట్లాడారు. రైతుల కోసం 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని.. ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతుబీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరిగా దొరికేవి కావని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ ప్రకటించారు. కరోనా కాలంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం నిలువ చేసే భారీ స్థాయిలో గోదాములు రాష్ట్రంలో ఉండవని తెలిపారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యత కేంద్రందే అన్నారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని.. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో వరి వద్దన్నారని వివరించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొనుగోలు చేయమని నిరాకరిస్తోందని అది స‌రికాద‌న్నారు. ధాన్యం నిల్వ చేసే అవకాశం రాష్ట్రాలకు లేదని, కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలుపై సంబంధిత మంత్రి సంప్రదించాన‌ని ఆయ‌న గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎఫ్‌సిఐ కుదుర్చుకున్న ఎంఓయూలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భవిష్యత్తులో బాయిల్డ్‌ రైసు ఇవ్వమని చెబితేనే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విధి లేక అంగీకరించామ‌న్నారు. ఈ ఏడాది ఎంత తీసుకుంటామో కేంద్రం ఇప్పటి వరకు చెప్పలేద‌న్నారు. వర్షాకాలంలో 62 లక్షల ఎకరాలో వరి పంట సాగు చేశార‌ని, కోటి 70లక్షల టనున్న ధాన్యం వచ్చింద‌ని చెప్పారు. కోటి 10 లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో సిద్ధంగా ఉంద‌ని, ఇది తీసుకునే దిక్కేలేదన్నారు.

రైతు వ్యతిరేక చట్టాల విష‌యంలో ఉత్తర భారతదేశ రైతుల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుద‌న్నారు. ఇక నుంచి కేంద్రానికి చుక్క‌లు చూపిస్తామ‌ని నిద్ర పోనివ్వమని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. సిల్లి బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దని పేర్కొన్నారు. బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ దుయ్య‌బ‌ట్టారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే మెడలు విరుస్తామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like