కేసీఆర్ సింగ‌రేణిని దివాళా తీయిస్తున్న‌డు..

-ముఖ్య‌మంత్రికి చిత్త‌శుద్ధి ఉంటే శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి
-సింగరేణి అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలి
-రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని దివాళా తీస్తున్న‌రు
- సింగరేణి ఎన్నికల కోస‌మే బొగ్గు గనుల వేలంపై సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం
- బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఫైర్

హైద‌రాబాద్ : కేసీఆర్ సింగ‌రేణిని దివాళా తీయిస్తున్న‌డ‌ని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి విషయంలో మంత్రి కేటీఆర్ లేఖ రాయడంపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తిరగరాస్తానంటూ సీఎం వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం కావడంతో వాటిని దారి మళ్లించేందుకు టీఆర్ఎస్ నేతలు సింగరేణి పై రాజకీయం చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఒక్క ఓపెన్ కాస్ట్ కూడా రానీయబోమని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి ఇచ్చి మాట తప్పిండన్నారు. అధికారంలోకి వచ్చాక సింగరేణి మొత్తాన్ని ఆర్దికంగా దివాళా తీయిస్తున్నరని దుయ్య‌బ‌ట్టారు. సంస్థకు చెందిన నిధులను దారి మళ్లించి రూ.20 వేల కోట్ల బకాయి పడ్డ మాట వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు.

లాభాల్లో ఉన్న సంస్థను దివాళా తీయించి జీతాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే స్థితికి సింగరేణిని చేర్చిన విషయం నిజం కాదా? అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే… అందులో 22 వేల ఉద్యోగాలను కోత విధించి…. కేవలం 40 వేల మంది కార్మికులకే పరిమితం చేసింది వాస్తవమా..? కాదా..? అని దుయ్య‌బ‌ట్టారు. యూపీఏ-2 హయాంలో 218 బ్లాక్ లను అప్పనంగా తనకు నచ్చిన సంస్థలకు రాసిస్తుంటే… సుప్రీంకోర్టు తప్పు పడుతూ వాటిని రద్దు చేసింద‌ని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు బొగ్గు గనుల వేలంపై 2015లో పార్లమెంట్ యాక్ట్ చేసిన సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అప్పుడు కేసీఆర్ కూతురు కవిత ఎంపీగా ఉంటూ ఎన్డీఏకు మద్దుతిచ్చిన విషయం మరిచిపోయారా..? అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న గనులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు కేంద్రం కేటాయిస్తున్న సమయంలో ఏనాడూ సింగరేణి బ్లాకులను కేటాయించాలని సీఎం కేసీఆర్ ఎందుకు కోరలేదో సమాధానం చెప్పాల‌ని కోరారు. ఆనాడు సోయి లేకుండా ఉండి… ఇప్పుడు బీజేపీపై బురదచల్లడం సిగ్గుచేటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏఎమ్మార్ పేరిట తాడిచర్ల బొగ్గు గనులు అధికార పార్టీలో ఉన్న నేత బినామీ పేర్లతో కాంట్రాక్ట్ తీసుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. మైన్స్ యాక్ట్ ప్రకారం… ప్రైవేటు వ్యక్తులతో గనులను తవ్వించరాదని నిబంధలున్నా అందుకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చివరకు సింగరేణి కార్మికులకు సంబంధించి సీఎస్సార్, డీఎమ్మార్ ఫండ్ ను స్థానికంగానే ఖర్చు చేయాల్సి ఉన్నాసిద్దిపేటకు, ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నార‌ని అన్నారు. కరోనా నేపథ్యంలో 30 శాతం మాత్రమే ఇతర ప్రాంతాలకు ఖర్చు చేసేందుకు కేంద్రం అనుమతిస్తే… అందుకు భిన్నంగా రూ.500 కోట్లు డ్రా చేసి నిబంధనలకు కేసీఆర్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు.

బొగ్గు గనుల వేలం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ అని స్ప‌ష్టం చేశారు. గతంలో ఒరిస్సాలోని 9 బ్లాకులను తెలంగాణ తీసుకుంది. అందులో భాగంగానే నేడు సింగరేణిలోనూ 4 బ్లాక్ లు వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్లు వేసి కైవసం చేసుకునే అవకాశం ఉందని స్ప‌ష్టం చేశారు. అయినా టీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపెట్టడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్, రోశయ్య, చంద్రబాబు హయాంలో ఏనాడూ సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం లేదు. కేసీఆర్ హయాంలో మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయని తెలిపారు. సింగరేణి విషయంలో కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి.

టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణి లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాల‌న్నారు. సింగరేణిలో మరో 150 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వున్నాయి. వాస్తవానికి దేశంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేయడం లేదని తెలిపారు. లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తూ ఇంకా బొగ్గు దిగుమతి చేసుకుంటున్న విష‌యాన్ని గుర్తు చేశారు. త్వరలో సింగరేణి ఎన్నికలు రాబోతుండటంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి గెలవాలని లేఖల పేరుతో టీఆర్ఎస్ కుట్ర చేస్తోంద‌న్నారు. సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ నేతల భాగోతం తెలిసిపోయింది. టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని వెల్ల‌డించారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో అండర్ మైనింగ్ కు అనుమతి ఇవ్వాలి. సింగరేణి బకాయిలను తక్షణమే చెల్లించడంతో పాటు గతంలో మాదిరిగా 62 వేల మంది కార్మికులుండే నియామకాలు చేపట్టాలని, కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.

సింగరేణి ప్రయోజనాల విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డ్ ఆధ్వర్యంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like