అభ్య‌ర్థుల ఎంపిక‌లో కేసీఆర్ ట్విస్ట్…

ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన బండా ప్ర‌కాష్‌కు స్థానం - మంత్రి వ‌ర్గంలో సైతం స్థానం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కేసీఆర్ ఆచితూచి అడుగు వేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెకర్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్ పేర్లను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. వీరు అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయినట్టే.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ గత రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం, పార్టీ పట్ల విధేయత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు.

ముదిరాజ్ నేత కాబ‌ట్టే…

అభ్యర్థుల జాబితాలో ఐదుగురి పేర్లు తొలి నుంచి ప్రచారంలో ఉన్నవే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్ర‌కాష్‌కు ఎమ్మెల్సీ టికెట్‌కు ఇవ్వడం మాత్రం చాలా మంది ఊహించలేదు. దీని వెనక కేసీఆర్ పెద్ద కసరత్తే చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ముదిరాజ్ వర్గం నుంచి టీఆర్‌ఎస్‌లో బలమైన నేతగా ఎదిగిన ఈటల రాజేందర్.. పార్టీకి దూరం కావడం.. హుజురాబాద్‌లో బీజేపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన బండి ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా తీసుకుని కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నారని సమాచారం. బండా ప్ర‌కాష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, ముదిరాజ్ సామాజిక వర్గానికి కేబినెట్‌లో ప్రాతినిథ్యం ఉండాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప‌ద‌వి మ‌రో మూడేండ్లు ఉన్నా…

బండ ప్రకాష్‌ ఎమ్మెల్సీ కావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో మూడున్నరేళ్లు ఉంది. ఖాళీ ఐన స్థానానికి మాజీ స్పీకర్ మధుసూదనచారిని పంపించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. వాస్తవానికి మధుసూదనచారికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయమనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆయనను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగ‌తా నేత‌ల పేర్లు మొద‌టి నుంచి వినిపిస్తున్న‌వే. మొత్తానికి కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యానికి నిద‌ర్శ‌నంగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిగిన‌ట్లు రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like