కేంద్రం రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాద మృతుల పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది కూలీలు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను మోడీ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: బండి సంజయ్‌
బోయగూడ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడం తనను కలచివేసిందని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పొట్టకూటి కోసం బీహార్‌ నుంచి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అనుమతుల నుంచి సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం.. పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఈ ఘ‌ట‌న దిగ్భ్రాంతి క‌లిగించింది..
సికింద్రాబాద్‌లోని బోయగూడ భారీ అగ్నిప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది మృతిచెందడం అత్యంత బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు రేవంత్‌ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

క‌లిచివేసింది : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
సికింద్రాబాద్‌ బోయగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమని.. వారి మృతి తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఉపాధి కోసం బీహార్‌ నుంచి వలస వచ్చిన కూలీలు మృతిచెందడం దురదృష్టకరమన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like