సీఎం ప‌ద‌విపై ఖ‌ర్గే క్లారిటీ

Telangana Congress: ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై ఏఐసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇవ్వాళే దానిపై తేల్చేస్తామ‌ని చెప్పారు. సాయంత్రంలోపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సోమవారం సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ.. గెలిచిన ఎమ్మెల్యేలు అంతా ఏకవాక్య తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి ఈ తీర్మానం ప్రవేశపెట్టగా.. తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క తదితరులు బలపర్చారు. ఈ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపించారు.

సోమ‌వారం సాయంత్ర‌మే సీఎల్పీ నేత ఎంపిక‌పై ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంతా భావించారు. ఏకంగా ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారానికి సైతం ఏర్పాట్లు చ‌క‌చ‌కా సాగాయి. కానీ, అధిష్టానం కాంగ్రెస్ శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని.. సోమవారం రాత్రి 8 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ రాజ్ భవన్ వద్ద.. కొత్త సీఎం కోసం కాన్వాయ్ కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇక, సోనియా నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ సైతం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కూడా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఆ స‌మావేశంలో తెలంగాణ విష‌య‌మై చ‌ర్చించ‌లేదని నేత‌లు స్ప‌ష్టం చేశారు.

గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదిక సైతం డీకే శివకుమార్ అధిష్ఠానానికి పంపించారు. సోమ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత అయినా ప్ర‌కట‌న వ‌స్తుంద‌ని వేచి చూశారు. కానీ, అలా జ‌ర‌గలేదు. డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు పరిశీలకులు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగ‌ళ‌వారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై.. సీఎం అభ్యర్థిపై తుది నిర్ణయానికి రానున్నారు. మంగళవారం సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని మ‌ల్లికార్జున ఖ‌ర్గే చెప్ప‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఇవ్వాలైనా ప్ర‌క‌ట‌న ఉంటుందా..? లేదా..? అనే దానిపై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వేళ ఇవ్వాళ ప్ర‌క‌ట‌న చేసినా, మ‌రో రెండు రోజుల వ‌ర‌కు ముహూర్తాలు లేవ‌ని ఈ నెల 7న ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుంద‌ని తెలుస్తోంది. మరోవైపు సీఎం రేసులో ఉన్న టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గేతో వీరు భేటీ కానున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తమ పేర్లను కూడా పరిశీలించాలని వీరు కోరనున్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like