రెండోసారి అధ్య‌క్షుడిగా కిష‌న్‌రెడ్డి..

BJP:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా గంగాపురం కిషన్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పేరును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాష్ ప్రకటించారు. రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆయ‌న బీజేపీ అధ్య‌క్షుడిగా ఎన్నిక అవ‌డం ఇది రెండోసారి. మొద‌ట ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.

సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన కిష‌న్‌రెడ్డి ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి నాలుగోసారి అనూహ్యంగా ఓటమిపాలైన కిషన్ రెడ్డి.. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఆయ‌న కేంద్ర మంత్రిగా ప‌నిచేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపురంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి. 1977లో రాజకీయాల్లో వచ్చిన కిషన్ రెడ్డి అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పని చేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్ రెడ్డి.. తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్ పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు.

ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు ఆరేళ్లపాటు పని చేశారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కిషన్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్ లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయ‌న‌కు రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like