కోట్లు తెచ్చిన కోకాపేట భూములు

Telangana: హైద‌రాబాద్ నగరంలో కోకాపేట భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోకాపేట-నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు దాటడం విశేషం. ఉదయం నుంచి కొనసాగుతున్న వేలంలో భూముల కోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధర నిర్ణయించింది. ఈ-వేలంలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడటంతో ధరలు అమాంతం పెరిగాయి. అత్యధికంగా ఎకరం ధర రూ. 100.75 కోట్లు ఉండగా.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. గురువారం నిర్వహించిన రెండో దశ ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. నియో పోలిస్ ఫేజ్-2లోని 6,7,8,9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గురువారం ఉదయం వరకు 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబర్ ప్లాట్ల(18.47 ఎకరాల)కు వేలం నిర్వహించారు.

పదో నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ. 100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాటు ఉంది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థల పోటీ చూస్తుంటే ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్సీసీ, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కోకాపేట భూముల వేలంలో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, కోకాపేట నియోపోలిస్ పేరుతో హెచ్ఎండీఏ 500 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో రూ. 450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం తదితర అన్ని రకాల సదుపాయాలు కల్పించింది.

ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా భారీగానే ధర పలికింది. 2021లో ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా.. కనిష్టంగా ఎకరాకు రూ. 31 కోట్లు.. గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది. ఇప్పుడు ఫేజ్2లో 45.33 ఎకరాలకు ఈ వేలం నిర్వహించింది. కాగా, ఈ వేలం ద్వారా మొత్తం దాదాపు రూ. 2500 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ వేలం చూస్తుంటే.. అధికారుల అంచనాలకు మించి ఆదాయం వచ్చేలా ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like