అర‌ణ్య కాండ

కష్టాల కడలిలో అన్నలు - మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు - కరోనా, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో అతలాకుతలం - దళాలను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు - అగ్రనాయకత్వాన్ని కోల్పోవడంతో ఉద్యమానికి బీటలు - దండకారణ్యంపై పట్టుబిగిస్తున్న పోలీసులు - త్వరలోనే భారీ స్థాయిలో యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్

మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కరోనా దాడి, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో పార్టీ అతలాకుతలమవుతోంది. మరోపక్క దండకారణ్యంపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కొంత కాలంగా అడవుల్లో జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే మావోయిస్టు పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థతో పోలీసులు దండకారణ్యంపై పట్టు బిగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాన్నున్న రోజుల్లో మావోయిస్టు పార్టీ తన ఉద్యమాన్ని ఎలా ముందుకు నడిపిస్తుందోనన్న చర్చ జరుగుతోంది.

వరుస ఘటనలతో డీలా..

వ‌రుసగా జ‌రుగుతున్న ఎన్‌కౌంట‌ర్ల‌తో పాటు అగ్ర‌నేత‌ల మృతి కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. శ‌నివారం మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలి జిల్లా గ్యార‌ప‌ట్టి ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 26 మంది మావోయిస్టులు మ‌ర‌ణించ‌గా, ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు నెల‌కొర‌గ‌డం ఇది రెండో ఘ‌ట‌న‌. 2018లో క‌స‌న్‌సూర్ ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఏకంగా 42 మంది మ‌ర‌ణించారు. పోలీసులకు ఇది చాలా పెద్ద విజ‌యంగా చెబుతున్నారు. గ‌త నెల 14న కేంద్ర క‌మిటీ స‌భ్యుడు రామ‌కృష్ణ అనారోగ్యంతో మృతి చెంద‌గా, రెండు రోజుల కింద‌ట ఇద్ద‌రు కేంద్ర మిటీ స‌భ్యులు పోలీసుల‌కు చిక్కారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కిష‌న్ దాతో పాటు ఆయ‌న భార్య హేమ సైతం పోలీసుల‌కు దొరికిపోయారు. వీరిద్ద‌రూ కూడా కేంద్ర క‌మిటీ స‌భ్యులే. కిష‌న్ దా అలియాస్ ప్ర‌శాంత్ బోస్ మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక గ‌డ్చిరోలి జిల్లా గ్యార్‌ప‌ట్టి ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో దీప‌క్ తేల్‌తుంబ్డే సైతం మ‌ర‌ణించారు. ఇది కూడా పార్టీకి పెద్ద లోటుగానే క‌నిపిస్తోంది. ఇక ఇంకో కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మృతి సైతం ఆ పార్టీని కుంగ‌దీస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించాడు. కమ్యూనికేషన్స్‌తోపాటుగా ఎలక్ట్రానిక్‌ డివైస్‌లు తయారు చేయడంలో రవి దిట్ట. ముఖ్యంగా మావోయిస్టు టెక్నికల్‌ టీమ్‌లో రవి కీలక సభ్యుడిగా కొనసాగారు. మరికొంత మంది మావోయిస్టులు కూడా వయసుపైబడి అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తెలుస్తోంది.

క‌రోనా త‌ర్వాత క‌కావిక‌లం…

కరోనా వైరస్‌ రాక ముందు మావోయిస్టు పార్టీ కొంత బలంగా ఉండేదని ఇంటిల్‌జెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులపై కరోనాదాడి తరువాత ఉద్యమంలో అనేక మార్పులు వచ్చాయి. వైరస్‌ బారినపడి వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 20మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో హారిభూషన్‌, భారతక్క మరి కొంత మంది ముఖ్య నాయకులు ఉన్నారు. అలాగే పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన ‘లాల్‌వర్రాట్‌’, తెలంగాణలో చేపట్టిన ‘ఇంటికి రండి కుటుంబంతో జీవించండి’ అనే కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ కార్యక్రమాలతో రెండు రాష్ట్రాల్లో సుమారు 2,500పైగా మిలీషియా, దళసభ్యులు, కమాండర్‌లు, గ్రామకమిటీ సభ్యులు లొంగి పోయినట్లు తెలుస్తోంది. అలాగే ‘అపరేషన్‌ ప్రహార్‌’లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్లల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారు.

దండకారణ్యంపై పట్టుసాధిస్తున్న పోలీసులు

గతంలో దండకారణ్యంపై పోలీసులకు పెద్దగా పట్టుందేది కాదు. అడవుల్లోకి వెళ్లాలంటేనే ఒకటి రెండుసార్లు ఆలోచించేవారు. దండకారణ్యంలో పెద్ద ఘటనలు జరిగినా సమాచారం తెల్సుకునేందుకు గంటల తరబడి ఎదురు చూసేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతుండడంతో దండకారణ్యంపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. అడవుల్లో చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనాయకులు హరిభూషణ్‌, ఆర్కేలు మృతి చెందిన సందర్భాల్లో మావోయిస్టు పార్టీ కన్నా పోలీసులే ముందుగా వారి మృతి విషయాన్ని ప్రకటించారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇలా అన్ని ర‌కాలుగా దండ‌కార‌ణ్యంలో జ‌రుగుతున్న ప్ర‌తి ఒక్క విష‌యాన్ని ప‌సిగ‌డుతున్న పోలీసులు మావోయిస్టుల‌కు చెక్ పెడుతున్నారు. శ‌నివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ కూడా ఇదే విష‌యాన్ని దృవీక‌రిస్తోంది.

మ‌ళ్లీ యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్

మావోయిస్టుల ఏరివేత‌ కోసం మరోసారి సాయుధదళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టనున్నాయి. వర్షాకాలం ముగియడంతో అడవుల్లో ఇప్పుడు గాలింపు సులభం కావడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నక్సల్స్‌కు గట్టి పట్టున్న ప్రాంతాల్లోకి చొరబడి, భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా రెండంచెల వ్యూహలను బలగాలు అనుసరిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్‌, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్లు చేపట్టనున్నారు. ఈ ఏడాదిలో 24 ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్‌లు (ఎఫ్ఓబీ) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోగా, 10 ఛత్తీస్‌గఢ్‌లో, 7 మహారాష్ట్రలో, 6 జార్ఘండ్‌లో, ఒకటి ఒడిశాలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా నక్సల్స్‌ను కార్నర్ చేయడం, నక్సల్ ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించడం, మావోయిస్టు అగ్రనేత‌ల‌ను మ‌ట్టు పెట్ట‌డం ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయా రాష్ట్ర పోలీసుల సమన్వయంతో కోబ్రా, సీఆర్‌పీఎఫ్ యాంటీ నక్సల్ స్పెషలైజ్డ్ విభాగం మావోయిస్టులపైన, ముఖ్యంగా అగ్రనేతల కదలికలపైన కన్నువేసింది. నక్సల్స్ కీలక ప్రాంతాల్లో ప్రధానంగా సెక్యూరిటీ శిబిరాలు విస్తరించేందుకు వ్యూహరచన జరుగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like