కొండ‌గ‌ట్టుకు రూ. 1000 కోట్లు ఇచ్చేందుకైనా సిద్దం

-మ‌ళ్లీ వ‌స్తా... ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తా
-ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు

Telangana: ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కొండ‌గ‌ట్టు క్షేత్రాన్ని పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించేందుకు కేసీఆర్ బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆయ‌న‌తో పాటు కొండ‌గ‌ట్టుకు వ‌చ్చారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు సీఎంకు స్వాగతం పలికారు. నాచుపల్లి జేఎన్‌టీయూ హెలిప్యాడ్‌లో దిగిన సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అంజన్న సన్నిధికి చేరుకున్నారు.

భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం నిధులకు ఎలాంటి కొరత లేదని, అవసరమైతే రూ.1000 కోట్లు కేటాయించేందుకైనా సిధ్దమేనన్నారు. వసతులు గొప్పగా ఉంటేనే క్షేత్రానికి వచ్చే భక్తులు పెరుగుతారన్నారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృత స్థాయి సమావేశాల మాదిరిగా అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా చేపడతామన్నారు. ఏటా లక్షలాది మంది హనుమాన్ దీక్ష చేపడతారని, క్షేత్రానికి వచ్చే దీక్షాపరులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మంగళ, శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలాగే హనుమాన్ జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడిని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు ఆలయ అభివృద్ధి తర్వాత పెరుగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. 86 ఎకరాల్లో సువిశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సూచించారు. కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండగట్టు గుట్టపైకి తరలించి భక్తులకు సరిపోయేలా నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు శిల్పులను సమకూర్చాలని యాదాద్రి రూపకర్త ఆనంద్‌సాయికి సీఎం కేసీఆర్‌ సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like