కొనుగోల్‌మాల్‌

-సోమ‌న్‌ప‌ల్లిలో డీసీఎంఎస్ సెంట‌ర్ నిర్వాహ‌కం
-ఇష్టారాజ్యంగా కోత‌లు పెడ్తూ రైతుల‌ను మోసం చేస్తున్న వైనం
-చ‌ర్య‌లు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు

మంచిర్యాల:రైతుల ధాన్యం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాల్సి కొనుగోలు కేంద్రాలు వారిని నిలువునా ముంచుతున్నాయి. ఇష్టారాజ్యం కోత‌లు పెడుతూ ధాన్యానికి త‌క్కువ ధ‌ర ఇస్తుండ‌టంతో రైతులు ద‌గా ప‌డుతున్నారు. ఈ విష‌యంలో అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో క‌ర్ష‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండ‌లం సోమనపల్లిలోని డీసీఎంఎస్ సెంటర్ పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తూకంలో మోసానికి పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఒక కాంటాలో సుమారుగా బస్తాకు 3 కిలోల వరకు తూకం లో మోసం జ‌రుగుతోంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులతో గొడవ పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమ‌ని బెదిరిస్తున్నాడ‌ని, వారి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక త‌న హ‌ర్వెస్ట‌ర్ మిష‌న్‌తో ధాన్యం కోయించుకున్న రైతుల ధాన్యం మాత్ర‌మే ముందు కొన్నాడ‌ని రైతులు మండిప‌డ్డారు.

లారీ లోడ్ అయి వెళ్లిన త‌ర్వాత కూడా కొంద‌రు రైతుల వ‌ద్ద ధాన్యం మంచిగా లేద‌ని, మిల్ల‌ర్లు వ‌డ్లు తీసుకోవ‌డం లేద‌ని, మీ లోడ్ వెన‌క్కి పంపుతామ‌ని బెదిరిస్తున్నాడని రైతులు చెబుతున్నారు. ఆ పరిస్థితిలో రైతులు ఏమి చేయలేని స్థితిలో…. ఎంత కటింగ్ అయినా ప‌ర్వాలేదు వ‌డ్లు అమ్మమని చెబితే.. ధాన్యానికి కటింగ్ ఎక్కువ అవుతుంద‌ని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. ఏప్రిల్ 18, 27 రోజున కోసిన ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సెంటర్ ప్రారంభోత్సవం రోజు వచ్చిన నిర్వాహకుడు ఇంత వరకు సెంటర్ కు వచ్చి చూసిన దాఖలు లేవని రైతులు మాట్లాడారు.. ఇక్క‌డి వాచ్ మెన్ సెంటర్ నిర్వహకునిగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ సెంటర్ నడుపుతున్న నిర్వాహకునిపై చర్యలు తీసుకొని రైతలకు న్యాయం చేయాలని సోమనపల్లి రైతులు కోరుతున్నారు. గతం లో కూడా ఈ సెంటర్ పై పలు ఆరోపణలు వ‌చ్చినా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు తెలిపారు…

Get real time updates directly on you device, subscribe now.

You might also like